క్షయ వ్యాధి సోకిన ఓ విద్యార్థి పట్ల ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. క్షయ వ్యాధి ఉందన్న కారణంతో విద్యార్థిని పరీక్ష రాయడానికి అనుమతించ లేదు. ప్రభుత్వ కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్ ప్రవర్తనతో యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తనను పరీక్షకు అనుమతించాలి అని కోరుతూ కాలేజీ గేట్ ఎదుట ధర్నాకు దిగాడు. కొడుకు పక్కన అతడి తల్లి కూడా కూర్చొని కాలేజీ వ్యవహారంపై నిరసన తెలిపింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో గల కుల్పి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ యువకుడు.. కుల్పీలోని ప్రభుత్వ కాలేజీలో ఏసీ, రిఫ్రిజిరేటర్ సంబంధిత సబ్జెక్టులు చదవడానికి అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలోనే ఆరు నెలల కిందట విద్యార్థి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. మెడికల్ పరీక్షల్లో విద్యార్థికి క్షయ వ్యాధి సోకిందని తెలిసింది. అప్పటి నుంచి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి క్షయ వ్యాధి సోకిన విషయం కాలేజీ అధికారులకు తెలియడంతో సమస్య మొదలైంది.
కాలేజీ నుంచి తన పేరును తొలగించారని విద్యార్థి ఆరోపించాడు. తనను పరీక్ష రాసేందుకు కూడా అనుమతించలేదని చెప్పాడు. మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థి కాలేజీకి వెళ్లాడు. అయితే అతడిని కాలేజీ లోపలికి రానివ్వలేదు. దీంతో విద్యార్థి ధర్నాకు దిగాడు. ఇదే విషయమై ప్రిన్సిపాల్‌ను మీడియా సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రభుత్వ కాలేజీలో ఓ విద్యార్థి పట్ల ఇలా వ్యవహారించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.