15 రోజుల పాటు గొంతులో ఇరుక్కుపోయిన జలగ.. ఆపరేషన్‌ తర్వాత సజీవంగా బయటకి..

A leech stuck in the throat of a young man drinking water at the fountain. పర్వతాల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఊట నీరు తాగుతుండగా గొంతులోకి జలగ ప్రవేశించింది.

By అంజి  Published on  23 Dec 2022 7:59 AM GMT
15 రోజుల పాటు గొంతులో ఇరుక్కుపోయిన జలగ.. ఆపరేషన్‌ తర్వాత సజీవంగా బయటకి..

పర్వతాల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఊట నీరు తాగుతుండగా గొంతులోకి జలగ ప్రవేశించింది. సుమారు 15 రోజుల పాటు అతడి శ్వాసనాళంలో జలగ సజీవంగా ఇరుక్కుపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ (ఎన్‌బి మెడికల్ కాలేజీ), ఆసుపత్రిలోని ముక్కు-చెవి-గొంతు విభాగంలో వైద్యులు బాధితుడికి శస్త్రచికిత్స చేసి జలగను తొలగించారు. వైద్యులు ఆ వ్యక్తిని మృత్యుముఖం నుంచి వెనక్కి తీసుకొచ్చారు. ఆశ్చర్యకరంగా.. శ్వాసనాళం నుండి తొలగించబడిన తర్వాత కూడా జలగ సజీవంగా ఉంది రెండు వారాల పాటు శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన జలగ ఎలా బతికిందోనని డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

జలగ గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైన వ్యక్తి పేరు సజిన్ రాయ్, వయస్సు 49 సంవత్సరాలు అని వైద్యులు తెలిపారు. అతను మిరిక్ నివాసి. 15 రోజుల క్రితం పర్వత ప్రాంతంలోని ఊటలో నీరు తాగేందుకు వెళ్లగా.. గొంతులో జలగ ఇరుక్కుపోయింది. తర్వాత అది శ్వాసనాళంలోకి వెళ్లింది. అప్పటి నుంచి అతడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అతను అసౌకర్యాన్ని వదిలించుకోవడానికి ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్ళాడు. ఈఎన్‌టీ వైద్యులు రాధేశ్యామ్ మహతో, సౌమిక్ దాస్, గౌతమ్ దాస్, సౌమేందు భౌమిక్, మణిదీప సర్కార్, తుహిన్ షస్మల్, అజహురుద్దీన్, అజితవ్ సర్కార్‌ల బృందం సుమారు గంటన్నరపాటు శస్త్రచికిత్స చేసి జలగను తొలగించారు. రోగికి గురువారం శస్త్ర చికిత్స నిర్వహించగా, శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

అంతేకాకుండా, అనస్థీషియా బృందానికి డాక్టర్ అభిషేక్ గంగోపాధ్యాయ నాయకత్వం వహించారు. తన గొంతులోని జలగను విజయవంతంగా తొలగించినందుకు ఆ వ్యక్తి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ శస్త్రచికిత్స అత్యంత అరుదైన కేసు అని వైద్యులు పేర్కొంటున్నారు. రాధేశ్యాంబాబు మాట్లాడుతూ.. ''దాదాపు 40 ఏళ్ల నా వైద్యసేవలో పదిహేను రోజులుగా శ్వాసనాళంలో జీవిస్తున్న జలగను చూడలేదు. ఇది అరుదైన సంఘటన. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నాడు.'' అని చెప్పారు. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్యులకు సజిన్‌ రాయ్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

Next Story