ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
A Key Supreme Court Decision On EWS quota in admissions and Govt job.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2022 6:28 AM GMTఈడబ్ల్యూఎస్(అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ కేంద్రం చేపట్టగా దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఇటీవల ముగించిన సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తుదితీర్పు వెల్లడించింది. ఈ రిజర్వేషన్ ఇవ్వడంలో ఎలాంటి వివక్ష లేదని, ఇది రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ధర్మాసనంలోని జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్థివాలా సమర్థించగా జస్టిస్ రవీంద్రభట్, సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్ వ్యతిరేకించారు.
ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్‌లు కల్పన సరైనదేనని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది అన్నారు. EWS కోటా కోసం 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. ఇది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని జస్టిస్ దినేష్ మహేశ్వరి చెప్పారు. EWS కోటా చెల్లుబాటు అవుతుంది.. రాజ్యాంగబద్ధమైనది అనే జస్టిస్ మహేశ్వరి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ డబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటుందనేది వారి ప్రధాన అభ్యంతరం.
సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లను మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్ర ప్రభుత్వం తమ వాదనను వినిపించింది. ఇరువురి వాదనలు ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.