ఉగ్ర‌వాది నాలుగేళ్ల కుమారుడి ఆవేద‌న.. నాన్నా బ‌య‌ట‌కు రా.. నిన్ను చూడాలి.. వీళ్లేం చేయ‌రు

A Kashmiri Child's Plea to Holed up Militant Father Fails.నాన్న నా కోసం బ‌య‌ట‌కు రండి. మీరు చాలా గుర్తొస్తున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2021 8:12 AM GMT
A Kashmiri Childs Plea to Holed up Militant Father Fails

నాన్న నా కోసం బ‌య‌ట‌కు రండి. మీరు చాలా గుర్తొస్తున్నారు. వీళ్లు మిమ్మ‌ల్ని ఏమీ చేయ‌రు. మిమ్మ‌ల్ని చూడాల‌ని ఉంది. తొంద‌ర‌గా రండి నాన్నా అంటూ ఓ నాలుగేళ్ల చిన్నారి.. ఉగ్ర‌వాది అయిన త‌న తండ్రి కోసం ప‌డిన‌ ఆరాటం ఇది. జ‌మ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో సోమ‌వారం భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌త‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఎన్‌కౌంట‌ర్‌కు ముందు ఉగ్ర‌వాదుల‌ను లొంగిపొమ్మ‌ని వారి కుటుంబ స‌భ్యులతో పోలీసులు విజ్ఞ‌ప్తి చేయించారు. అకిబ్ అహ్మ‌ద్ మాలిక్ అనే ఉగ్ర‌వాది మొక్క‌ నాలుగేళ్ల చిన్నారి.. త‌న తండ్రిని లొంగిపోవాల్సిందిగా అభ్య‌ర్థిస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ‌

వివ‌రాల్లోకి వెళితే.. బ్యాంక్‌ ఉద్యోగిగా పని చేస్తున్న అహ్మద్‌ మాలిక్ (25) డిసెంబ‌ర్ 20 నుంచి క‌నిపించ‌కుండా పోయాడు. అత‌డు ఉగ్ర‌వాదుల్లో చేరాడు. అయితే.. అత‌డు ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజున‌నే కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వారికి ఎదురుపడితే.. అతడిపై కాల్పులు జరపవద్దని..అత‌డితో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. షోపియాన్ జిల్లాలోని మ‌నిహాల్ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల ఉనికిపై స‌మాచారం అంద‌డంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ఆదివారం రాత్రి గాలింపు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో ఓ ఇంట్లో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు గుర్తించారు. ముందుగా వారిని లొంగిపోమ్మ‌ని చెప్ప‌గా వారు విన‌లేదు. దీంతో వారి కుటుంబ స‌భ్యుల‌ను అక్క‌డికి తీసుకొచ్చారు.

అకిబ్ అహ్మ‌ద్ మాలిక్ అనే ఉగ్ర‌వాది భార్య‌, కుమారుడు కూడా అక్క‌డికి వ‌చ్చారు. ముందుగా మాలిక్ భార్య మైక్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. అత‌డిని లొంగిపోవాల‌ని కోరింది. 'దయచేసి బయటకు వచ్చి లొంగిపో.. నాతో పాటు మ‌న పిల్ల‌లు కూడా వ‌చ్చారు. నీకు బ‌య‌ట‌కు రావాల‌ని లేక‌పోతే ముందు మమ్మ‌ల్ని కాల్చి చంపేయ్' అని వేడుకుంది. అయిన‌ప్ప‌టికి ఆమె మాట‌ను అత‌డు విన‌లేదు. అనంత‌రం వారి నాలుగేళ్ల కుమారుడు అబ్ర‌ర్ త‌న తండ్రిని లొంగిపోమ్మ‌ని కోరాడు. "అబ్బూ జీ నేను అబ్ర‌ర్‌ను. మీరు బ‌య‌ట‌కు రండి. వీళ్లు మిమ్మ‌ల్ని ఏం చేయ‌రు. బ‌య‌ట‌కు రండి. మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు." అంటూ తండ్రిని బ‌తిమిలాడాడు. బిడ్డ గొంతువిన్న మాలిక్ హృదయం క‌రిగింది. అత‌డు బ‌య‌ట‌కు రావాల‌ని అనుకున్నా.. ప‌క్క‌నే ఉన్న ఉగ్ర‌వాదులు అత‌డు లొంగిపోయేందుకు అంగీక‌రించ‌లేదు.

అనంత‌రం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మాలిక్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై ఆర్మీ అధికారి ఒక‌రు స్పందించారు. ఉగ్ర‌వాదులు లొంగిపోవాల‌ని వారి కుటుంబ స‌భ్యుల‌తో చెప్పించాం. భార్య‌, కుమారుడి మాట‌లు విన్న త‌రువాత మాలిక్ బ‌య‌ట‌కు రావాల‌ని అనుకున్నా.. తోటి ఉగ్ర‌వాదులు అత‌డిని రానివ్వ‌లేద‌ని మాకు స‌మాచారం వ‌చ్చింది. ఒక‌వేళ అత‌డు లొంగిపోయి ఉంటే అత‌డిని మేం కాపాడేవాళ్లం అని చెప్పారు. మాలిక్‌తో అత‌డి కుమారుడు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయ‌గా.. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.
Next Story
Share it