భారత సంతతి బాలికకు.. బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్స్ ఆఫ్ లైట్‌ అవార్డు

ఏడేళ్ల భారతీయ సంతతి బాలిక 'బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్స్ ఆఫ్ లైట్' అవార్డును అందుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 20 July 2023 12:30 PM IST

Indian origin girl, Moksha, British Prime Ministers Points of Light Award

భారత సంతతి బాలికకు.. బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్స్ ఆఫ్ లైట్‌ అవార్డు 

ఏడేళ్ల భారతీయ సంతతి బాలిక 'బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్స్ ఆఫ్ లైట్' అవార్డును అందుకుంది. తన మూడేళ్ల వయసులోనే మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సుస్థిరత చొరవ కోసం స్వచ్ఛందంగా పని చేయడం ప్రారంభించిన అమ్మాయికి బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు లభించింది. గత వారం బ్రిటన్‌ ఉప ప్రధాని ఒలివర్‌ డౌడెన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంది మోక్షరాయ్‌. ఈ అరుదైన గుర్తింపును అందుకున్న ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.

ప్లాస్టిక్ ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్లాస్టిక్ మీద పోరాటాన్ని చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టింది మోక్ష. ఎంతో మంది పిల్లలకు సహాయం చేయడానికి నిధులు సేకరించడం కూడా మోక్షకు చాలా ఇష్టమే..!

"UN సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు) కోసం పోరాడడంలో మోక్ష ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. పాఠశాల పాఠ్యాంశాల్లో వీటిని చేర్చడానికి ఆమె చాలా కష్టపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులతో మాట్లాడి.. ఆయా దేశాలలో కూడా దీనిని పరిగణించమని వారిని ప్రోత్సహించింది. " అని డౌడెన్ చెప్పుకొచ్చారు. "ఆమె చదువుకునే పాఠశాలలో ఇకపై ప్లాస్టిక్ గ్లిట్టర్, కన్ఫెట్టి, ప్లాస్టిక్ ఆర్ట్ సామాగ్రిని ఉపయోగించరు. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఆమె తన చుట్టూ ఉన్నవారిని మార్చగలననే నమ్మకాన్ని ఇచ్చింది" అని ఆయన అన్నారు. మోక్ష భారతదేశంలోని పేద పిల్లలకు కూడా సహాయం చేసింది.

"పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ భూమిని కాపాడుకోడానికి ప్రజలు శ్రద్ధ చూపుతారని భావిస్తూ ఉన్నానని. రోజువారీ జీవితంలో చేసే పనులతో పర్యావరణాన్ని కాపాడవచ్చని.. మన రోజువారీ జీవితాల్లో కొన్ని మార్పులు చేస్తే చాలు" అని తెలిపింది మోక్ష.

"పళ్ళను బాగా చూసుకోడానికి,నొప్పిని నివారించడానికి మనం పళ్ళు తోముకుంటాము; అదేవిధంగా మనం భూమిని కాపాడాలని అనుకుంటే అది మన చేతుల్లోనే ఉంది. మన గ్రహం బాగుంటేనే మనం కూడా సురక్షితంగా ఉండగలము. వాతావరణ మార్పు, కాలుష్యం, పేదరికం, అసమానత వంటి పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి మనలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.. చిన్న చిన్న పనులతో ఇది సాధించవచ్చు" అని ఆమె చెప్పింది.

వాతావరణం మార్పును ఎదుర్కోవడంలో సమాజంలోని చిన్నపిల్లలు కూడా పాత్ర పోషించాలని తమ కుమార్తె చేసిన ప్రయత్నాలు నిరూపిస్తున్నాయని ఆమె తల్లిదండ్రులు రాగిణి జి రాయ్, సౌరవ్ రాయ్ అన్నారు. డౌనింగ్ స్ట్రీట్ ప్రకారం, పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డులు అత్యుత్తమ వ్యక్తులకు లభిస్తాయి. వారు చేసిన సేవ సమాజంలో మార్పును తీసుకుని వస్తుందని గట్టిగా నమ్ముతారు. సామాజిక సవాళ్లకు ఎదుర్కోడానికి వినూత్న పరిష్కారాలను తీసుకుని రాగలరు.

Next Story