ఓ ఇంటి హాలులో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ చార్జింగ్ పెట్టారు. అయితే అకస్మాత్తుగా స్కూటర్ బ్యాటరీ పేలింది. అదే సమయంలో అక్కడే నిద్రిస్తున్న బాలుడు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ముంబై సమీపంలోని వసాయ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. చనిపోయిన బాలుడు షబ్బీర్ షానవాజ్ అన్సారీ. రాందాస్ నగర్‌కు చెందిన షానవాజ్ అన్సారీ అనే వ్యక్తి సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఛార్జింగ్ కోసం తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హాల్‌లో పెట్టాడు.
అయితే ఉదయం 5:30 గంటల ప్రాంతంలో బ్యాటరీ పేలిపోయింది. దీంతో స్కూటర్ బ్యాటరీ పేలడంతో హాలులో నిద్రిస్తున్న బాలుడు షబ్బీర్, తల్లి రుక్సానాకు గాయాలయ్యాయి. ముఖ్యంగా బాలుడు షబ్బీర్ కు 70 నుంచి 80 శాతం కాలిన గాయాలై చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. అయితే సరైన సమయంలో చికిత్స అందక బాలుడు మృతి చెందాడు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 30న మృతి చెందాడు. ఈ మృతికి స్కూటీ కంపెనీయే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పేలుడు ధాటికి కిటికీ అద్దాలు పగిలిపోయి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గృహోపకరణాలు, గాడ్జెట్లు కూడా ధ్వంసమయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. వేడెక్కడం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని మానిక్‌పూర్ పోలీసులు తెలిపారు. జైపూర్‌కు చెందిన స్కూటర్ తయారీదారులను బ్యాటరీని పరిశీలించాల్సిందిగా కోరినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.