మరణించిన భర్త స్పెర్మ్‌తో బిడ్డకు జన్మనిచ్చిన 48 ఏళ్ల మహిళ

మరణించిన భర్త స్పెర్మ్‌తో మహిళ పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. భర్త స్పెర్మ్‌ను ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా మహిళ అండంలో ప్రవేశపెట్టడం ద్వారా ఇది జరిగింది.

By అంజి  Published on  17 Dec 2023 4:30 AM GMT
birth, IVF, sperm, Bengal , Rampurhat Medical College Hospital

మరణించి భర్త స్పెర్మ్‌తో బిడ్డకు జన్మనిచ్చిన 48 ఏళ్ల మహిళ

కోవిడ్‌తో మరణించిన భర్త స్పెర్మ్‌తో ఓ 48 ఏళ్ల మహిళ పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. భర్త స్పెర్మ్‌ను ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా మహిళ అండంలో ప్రవేశపెట్టడం ద్వారా ఇది జరిగింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన బెంగాల్‌లోని భీర్‌భూమ్‌ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ ప్రసాద్‌కు 27 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండటం వల్ల ఏళ్లుగా సంతానం కలగలేదు. ఈ క్రమంలోనే దంపతులు ఐవీఎఫ్‌ పద్ధతిలో పిల్లల్ని కనాలని నిశ్చయించుకున్నారు. రెండేళ్‌ల కిందట సంగీత భర్త.. తన వీర్యాన్ని కోల్‌కతాలోని ఓ స్పెర్మ్‌ ల్యాబ్‌లో భద్రపరిచారు.

ఆ తర్వాత కోవిడ్‌ కారణంగా మరణించారు. అది జరిగిన కొన్నాళ్లకు సంగీత తన భర్త స్పెర్మ్‌ని తన అండంలో ప్రవేశపెట్టి ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. అలా అరుణ్ ప్రసాద్ స్పెర్మ్‌ని సంగీత అండంలోకి ప్రవేశపెట్టారు. అది సక్సెస్‌ కావడంతో ఆమె గర్భవతి అయ్యింది. డిసెంబరు 12న రాంపుర్​హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సంగీత కుమారుడు రెండున్నర కేజీల బరువుతో జన్మించాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆమె ఒంటరిగా ఉన్నందున బిడ్డను చూసుకోవడానికి ఆమె పక్కన ఎవరూ లేరు. భర్త చనిపోయినప్పటి నుండి ఆమె అత్తవారి ఇంట్లో ఎవరూ ఆమెతో టచ్‌లో ఉండరు.

సంగీత ఉత్తర 24 పరగణాలలోని నైహతికి చెందినది. ఆ జంట మురారై ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నారు. తన భర్త మరణం తర్వాత, ఆమె తనంతట తానుగా కిరాణా దుకాణాన్ని నడిపింది. రాంపూర్‌హాట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ పలాష్ దాస్ మాట్లాడుతూ, “క్లిష్ట పరిస్థితుల్లో ఆ మహిళ తల్లి అయ్యింది. ప్రసవ వయస్సు ముగిసే సమయంలో, ఆమె శుక్రకణాన్ని భద్రపరిచి, తల్లిగా ఉండటానికి సాహసం చేసిన తీరు ప్రశంసనీయం. దీనికి ఆమె సెల్యూట్‌కి అర్హురాలు. తల్లి,బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నందున మేము సంతోషంగా ఉన్నాము" అని అన్నారు.

Next Story