కేరళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రికులు ప్రయాణీస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడి పోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా చిన్నారి సహా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
యాత్రికులతో ప్రయాణిస్తున్న వాహనం కులిమి-కుంబం రహదారిపై వెలుతుండగా శుక్రవారం రాత్రి 11 గంట సమయంలో అదుపు తప్పి వాగులో పడిపోయింది. స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి వ్యాన్ కింద పడడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. సమాచారం అందుకున్న ఇడుక్కి జిల్లా కలెక్టర్ కూడా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
యాత్రికులు తమిళనాడులోని తేని జిల్లా అండిపెట్టి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరు శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారకు వచ్చారు.