వెస్ట్ బెంగాల్‌లో దసరా పండుగ రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జల్పయ్‌గురి జిల్లాలోని మల్బజార్‌లో రాత్రి 9 గంటల సమయంలో మాల్ నదిలో ఆకస్మికంగా వరదలు రావడంతో.. దుర్గమాత విగ్రహం నిమజ్జనం చేస్తుండగా 8 మంది వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. నదీ ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా మారడంతో అ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సాయంత్రం నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది మాల్ నది ఒడ్డున గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
''అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. ప్రజలు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. మేము సుమారు 50 మందిని రక్షించాము'' అని జల్పయ్‌గురి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోదారా చెప్పారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, స్థానిక పరిపాలన బృందాల సెర్చ్, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి" అని అధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పయ్‌గురిలో దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.