హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. ప్రయాణీకులతో వెలుతున్న బస్సు చంబా జిల్లాలో లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగ్లీ నుంచి చాంబా ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు తీశా వద్ద అదుపుతప్పి 200 మీటర్ల తోతు ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 19 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఈ ప్రమాదంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్, చురా ఎమ్మెల్యే హన్స్‌రాజ్ సహా ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.