హైదరాబాద్: ఈనెల 27వ తేదీన నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నామని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న 175 మంది ట్రైనీ ఐపీఎస్‌లకు నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 175 మంది ఐపీఎస్‌లలో ఇండియాన్ ట్రైనీ ఐపీఎస్ లు 155 మంది ఉండగా, మరో 20 మంది ఫారిన్ ఐపీఎస్‌లు ఉన్నారు. మొత్తం 175 మంది శిక్షణ పూర్తి చేశారు. 102 వారాలు పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో ఐపీఎస్ ట్రైనీలు మొదటి దశ పూర్తి చేసుకున్నారు. 75వ ఐపీఎస్ బ్యాచ్‌లో 34 మంది మహిళ ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారు. అందులో 32 మంది ఇండియన్ ట్రైనీ ఐపీఎస్‌లు ఉండగా, ఇద్దరు విదేశీయులు సైతం ఉన్నారు.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు 14 మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించడం జరిగింది. అందులో తెలంగాణకు 9 మంది కాగా, ఏపీకి 5 మంది ఐపీఎస్‌లను కేటాయించారు. అయితే ఇందులో తెలంగాణకు ముగ్గురు మహిళ ఐపీఎస్ లు ఉండగా, ఏపీకి ఒక మహిళ ఐపీఎస్ కేటాయించడం జరిగింది. ఈ 75 వ బ్యాచ్‌లో 102 ట్రైనీ ఐపీఎస్‌లు ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వారు ఉన్నారు. ఐపీఎస్ ట్రైనీలో ఎంపికైన వారిలో తొమ్మిది మంది 25 ఏళ్ల వయస్సు లోపు కలిగిన వారు ఉండడం గమనార్హం. ఈ నెల 27వ తేదీన జరగబోయే నేషనల్ పోలీస్ అకాడమీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ వెల్లడించారు.