గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం.. నీట మునిగి ఏడుగురు మృతి..సీఎం దిగ్భ్రాంతి

7 Drown In7 Drown In Haryana During Ganesh Idols Immersion Ceremony.గ‌ణేశ్ నిమ‌జ్జ‌నోత్స‌వంలో అప‌శృతి చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Sep 2022 2:14 AM GMT
గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం.. నీట మునిగి ఏడుగురు మృతి..సీఎం దిగ్భ్రాంతి

గ‌ణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నోత్స‌వంలో అప‌శృతి చోటు చేసుకుంది. విఘ్నేశ్వ‌రుడిని నిమ‌జ్జ‌నం చేస్తుండ‌గా.. ఏడుగురు నీట మునిగి మ‌ర‌ణించారు. హ‌ర్యానా రాష్ట్రంలో రెండు వేరు వేరు చోట్ల ఈ విషాద ఘ‌ట‌న‌లు చేసుకున్నాయి. మహేంద్రగఢ్ జిల్లాలో న‌లుగురు మృతి చెంద‌గా, సోనిపట్ జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

సోనిప‌ట్ జిల్లాలోని మిమార్‌పూర్ ఘాట్ వ‌ద్ద గ‌ణేశ్ విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేసేందుకు ఓ వ్య‌క్తి త‌న కుమారుడు, అల్లుడితో క‌లిసి వ‌చ్చాడు. వీరంతా క‌లిసి గ‌ణనాథుడిని నిమ‌జ్జ‌నం చేస్తుండ‌గా.. ప్ర‌మాద వ‌శాత్తు ఈ ముగ్గురు నీటిలో మునిగి మ‌ర‌ణించారు. పోలీసులు వీరి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌లించారు.

మహేంద్రగఢ్ జిల్లాలోని కనీనా-రేవారి రహదారిలో ఉన్న ఝగడోలి గ్రామ సమీపంలోని కాలువలో గ‌ణేశ్ విగ్ర‌హాన్ని నిమజ్జ‌నం చేసేందుకు సుమారు 20 మంది వ‌చ్చారు. వీరిలో చాలా మంది నీటి ప్ర‌వాహానికి కొట్టుకుపోయారు. స‌మాచారం అందుకున్న అధికారులు వెంట‌నే గాలింపు చేప‌ట్టారు. న‌లుగురిని ర‌క్షించ‌గా.. ప్ర‌స్తుతం వీరు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మ‌రో న‌లుగురి మృత‌దేహాలు ల‌భ్యమైన‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌ల‌పై హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఇది చాలా బాధాక‌ర‌మైన విష‌యం అని అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని ట్వీట్ చేశారు.

Next Story