సీఎం నియోజకవర్గంలో.. కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

535 Fall Ill Due To Water Contamination In Many Villages In Himachal. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ సబ్ డివిజన్‌లోని డజను గ్రామాల్లో కలుషిత

By అంజి  Published on  30 Jan 2023 5:33 AM GMT
సీఎం నియోజకవర్గంలో.. కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ సబ్ డివిజన్‌లోని డజను గ్రామాల్లో కలుషిత నీటిని సేవించి అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఆదివారం నాటికి 535కి పెరిగింది. బాన్, జంద్గీ గుజ్రాన్, జందలి రాజ్‌పుతాన్, పన్యాల, పథియాలు, నియతి, రంగస్ చౌకీ హార్, థాయిన్, శంకర్‌తో సహా డజను గ్రామాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 300 దాటిందని రంగస్ పంచాయతీ అధిపతి రాజీవ్ కుమార్ అంతకుముందు రోజు చెప్పారు.

కొంతమంది రోగులను హమీర్‌పూర్‌లోని ఆసుపత్రులకు రెఫర్ చేశారు. జలశక్తి శాఖ అందించే కలుషిత నీరు తాగి ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు కుమార్ చెప్పారు. నీటి సరఫరా చేసే ట్యాంక్‌ కలుషితం కావడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. నిర్మాణంలో ఉన్న ట్యాంకు నుంచి నీటిని ఫిల్టర్ చేయకుండానే సరఫరా చేయడం వల్ల వ్యాధి ప్రబలిందని గ్రామస్తులు తెలిపారు. బాధితులంతా సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే.

నౌదాన్ నుండి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు.. రోగులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు, ఇతర వస్తువుల కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా పరిపాలన, ఆరోగ్య శాఖను ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఏజెన్సీల నుంచి పూర్తి నివేదికను కూడా సీఎంవో కార్యాలయం కోరింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (హమీర్‌పూర్) డాక్టర్ ఆర్‌కె అగ్నిహోత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రజలకు చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ బృందాలు బాధిత గ్రామాలకు చేరుకున్నాయి.

జలశక్తి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బాధిత గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేసి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపారు. సరఫరా నిలిపివేసిన తర్వాత ప్రజలకు బాటిల్ వాటర్ పంపిణీ చేస్తున్నారని ఆ శాఖ జూనియర్ ఇంజనీర్ తెలిపారు. గ్రామాల్లో వైద్యులు, ఆరోగ్య, ఆశా వర్కర్ల ద్వారా నిత్యావసర మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ దేబశ్వేత బానిక్ తెలిపారు. కాగా కలుషిత నీరు తాగడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story