సెలవు కోసం ఐదేళ్ల చిన్నారి హత్య
ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 9:28 AM IST
సెలవు కోసం ఐదేళ్ల చిన్నారి హత్య
ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్క రోజు సెలవు కోసం ఐదేళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు పదకొండేళ్ల చిన్నారులు, ఒక 9 ఏళ్ల చిన్నారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మదర్సాలో ఉన్నట్లుండి ఐదేళ్ల చిన్నారి రుహాన్ అపస్మారక స్థితిలోకి చేరాడు. దాంతో.. తల్లికి మదర్సా డైరెక్టర్ తల్లికి ఫోన్‌చేసి.. బాబు పరిస్థితి బాగోలేదని తెలిపాడు. వెంటనే రుహాన్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతి చెందడంతో మదర్సా బయట నిరసనలు వ్యక్తం అయ్యాయి. చిన్నారి నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసన కారులను అదుపు చేశారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దాంతో.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో చిన్నారి హత్యకు గురైనట్లు తేలింది. ఆ తర్వాత సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు పిల్లలు ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు. రుహాన్ 5 నెలల క్రితం మదర్సాలో చదువుకునేందుకు వెళ్లాడు. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో రుహాన్ ఫ్యామిలీ ఉంటోంది. రుహాన్ పట్ల మిగతా ముగ్గురు విద్యార్థులు దారుణంగా కొట్టి.. హత్య చేసినట్లు విచారణలో తేల్చారు. మరణానంతరం మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించారు. ఈ విషయాన్ని చిన్నారులే ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా.. మదర్సాలో 250 మంది పిల్లలు మత విద్యను అభ్యసిస్తున్నారు. కాగా.. ఈ హత్య సంఘటన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలను తమతమ ఇళ్లకు తీసుకెళ్లారు.