బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం.. సీఎం దిగ్భ్రాంతి

5 dead in cracker shop fire in Tamil Nadu.త‌మిళ‌నాడులో మంగ‌ళ‌వారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 3:06 AM GMT
బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం.. సీఎం దిగ్భ్రాంతి

త‌మిళ‌నాడులో మంగ‌ళ‌వారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు స‌జీవ ద‌హ‌నం కాగా.. మ‌రో 10 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. క‌ల్ల‌కురిచ్చి జిల్లా శంక‌రాపురం ప‌ట్ట‌ణంలోని ఓ బాణ‌సంచా దుకాణంలో పేలుడు సంభ‌వించింది. ట‌పాకాయ‌లు ఉండ‌డంతో భారీ ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. మంట‌లు ప‌క్క‌నే ఉన్న సెల్‌ఫోన్‌, బేక‌రీ దుకాణాల‌కు సైతం అంటున్నాయి. బేక‌రిలో ఉన్న నాలుగు గ్యాస్ సిలిండ‌ర్లు పేలాయి. దీంతో మంట‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగింది. ప‌క్క‌నే ఉన్న మ‌రికొన్ని దుకాణాల‌కు సైతం మంట‌లు వ్యాపించాయి. ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుపోయింది. పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.

స‌మాచారం అందుకున్న శంకరాపురం, రిషివందియం అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఎంతో శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు అగ్నిమాప‌క సిబ్బంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు సజీవ ద‌హ‌నం కాగా.. 10 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే సమీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. పరిస్థితిని జిల్లా కలెక్టరు పిఎన్‌ శ్రీధర్‌ సమీక్షించారు.

మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తీవ్ర‌దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయప‌డిన వారికి రూ.1ల‌క్ష చొప్పున అందిస్తామ‌న్నారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Next Story
Share it