Gold Smuggling: సూరత్ ఎయిర్‌పోర్టులో 48 కిలోల బంగారం పేస్ట్ పట్టివేత.. నలుగురు అరెస్ట్
డీఆర్‌ఐ సూరత్ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులు, ఒక అధికారి నుండి రూ.25 కోట్ల విలువైన 48.20 కిలోల బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకుంది.
By అంజి Published on 10 July 2023 7:36 AM ISTGold Smuggling: సూరత్ ఎయిర్‌పోర్టులో 48 కిలోల బంగారం పేస్ట్ పట్టివేత.. నలుగురు అరెస్ట్
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా నుండి ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, ఒక అధికారి నుండి రూ.25 కోట్ల విలువైన 48.20 కిలోల బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా స్మగ్లింగ్ సిండికేట్‌ను ఛేదించినట్లు డీఆర్‌ఐ తెలిపారు. ఇటీవలి కాలంలో అతిపెద్ద జప్తుల్లో ఇది ఒకటి. పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు జూలై 7న సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నంబర్ IX172 ద్వారా షార్జా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులను అడ్డుకున్నారు.
వీరు బంగారాన్ని పేస్టుగా మర్చి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానించారు. వారి బ్యాగేజీని తనిఖీ చేయగా.. 20 తెలుపు రంగు ప్యాకెట్లలో 43.5 కిలోల బంగారు ముద్దను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంగారాన్ని పేస్ట్‌గా మార్చి నడుముకు కట్టుకునే బెల్ట్‌లుగా మార్చి తరలించే ప్రయత్నం చేశారు. భారత దేశంలోని సూరత్ ఎయిర్ పోర్ట్‌లో 48 కేజీల బంగారం పట్టుబడడం మొదటి సారి. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న కొంత మంది అధికారుల సహాయంతో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
ప్లాన్ ప్రకారం.. ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ కన్న ముందు ఉన్న వాష్ రూమ్ లో బంగారం ఎక్స్చేంజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల స్కానింగ్, చెకింగ్ కు చిక్కకుండా ఉండడానికి పక్కా ప్లాన్ వేశారు. బంగారాన్ని వాష్ రూమ్‌లో ఓ అధికారికి అప్పగిస్తుండగా అక్కడికి చేరుకున్న డీఆర్‌ఐ బృందం.. వారిని రెడ్ హాండెడ్‌గా పట్టుకుంది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్న అధికారుల పాత్రపై సీరియస్‌గా డీఆర్‌ఐ అధికారులు కూపీ లాగుతున్నారు. ఎంత కాలం నుండి ఈ వ్యవహారం కొనసాగుతుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.