బీహార్‌లో 'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా వేర్వేరు సంఘటనలలో నదులు, చెరువులలో పవిత్ర స్నానాలు చేస్తూ 37 మంది చిన్నారులతో సహా కనీసం 43 మంది మునిగిపోయారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. బుధవారం జరిగిన పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా, మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు. వారూ పవిత్ర స్నానాలు చేస్తారు. "ఇప్పటి వరకు మొత్తం 43 మృతదేహాలను వెలికితీశారు. తదుపరి శోధన ఆపరేషన్ కొనసాగుతోంది" అని విపత్తు నిర్వహణ శాఖ (DMD) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
మృతుల బంధువులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఎక్స్‌గ్రేషియా అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే దాన్ని అందుకున్నారని ప్రకటన తెలిపింది. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్,అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.