అంధకారంలో చండీగఢ్.. 36 గంటలుగా కరెంట్ లేదు
36 Hour Blackout in Chandigarh as power employees go on strike.ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని కొద్ది
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2022 1:54 PM IST
ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని కొద్ది రోజులు క్రితం చండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్నిఉద్యోగులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో మూడు రోజుల సమ్మెకు విద్యుత్ సిబ్బంది పిలుపునిచ్చారు. సమ్మెకు వెళ్లొద్దని అధికారులు చెప్పినప్పటికి సిబ్బంది వారి మాటలను వినకుండా సోమవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్లారు. ఫలితంగా గత 36 గంటలుగా చండీగఢ్‌లో అంధకారం అలుముకుంది.
కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రులు, కార్యాలయాలు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పాటు అయ్యాయి. ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. జనరేటర్లతో ఆస్పత్రులను నడపడం అసాధ్యమని చండీఘడ్ హెల్తె సర్వీసెస్ డైరెక్టర్ సుమన్ సింగ్ తెలిపారు.
వేలాది ఇళ్లలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆన్‌లైన్ క్లాసులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ఫోన్‌లు చార్ఝింగ్ కోసం చాలా మంది ప్రజలు పొరుగు నగరాల్లో ఉండే తమ బంధువుల ఇళ్లకు వెలుతున్నారు. పరిస్థితులు దారుణంగా తయారు అవ్వడంతో చండీగఢ్ ప్రభుత్వం విద్యుత్ విభాగ సిబ్బందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేదం విధించింది.