కల్తీ పాలను విక్రయించినందుకు గాను ఓ వ్యక్తికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. కేసు నమోదు అయిన 32 సంవత్సరాల తరువాత తీర్పు రావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ లో హర్బీర్ సింగ్ అనే వ్యక్తి కల్తీ పాలను అమ్మాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ చంద్ 1990 ఏప్రిల్ 21న ఫిర్యాదు చేశాడు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. ఎట్టకేలకు పాల విక్రయదారుడు హర్బీర్ సింగ్‌ను దోషిగా నిర్ధారించింది ముజఫర్‌నగర్‌లోని కోర్టు. అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ గురువారం ఆ పాల వ్యాపారికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు 5 వేల జరిమానా విధించారు.
హర్బీర్ సింగ్ కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు తేలిందని ప్రాసిక్యూషన్ అధికారి రామావతార్ సింగ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. అతను విక్రయించిన పాల నమూనాను సేకరించి ల్యాబొరేటరీకి పంపగా, అందులో కల్తీ ఉన్నట్లు తేలిందన్నారు.