300 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌.. మహాకుంభ్‌లో యాత్రికుల ఉక్కిరి బిక్కిరి

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరు కావడానికి లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుండటంతో, నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌ అవుతోంది.

By అంజి  Published on  10 Feb 2025 11:10 AM IST
300 km-long traffic jam, Maha Kumbh, Akhilesh Yadav, UP government

300 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌.. మహాకుంభ్‌లో యాత్రికుల ఉక్కిరి బిక్కిరి

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరు కావడానికి లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుండటంతో, నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. దీంతో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమానికి యాత్రికులు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అధిక రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్ కూడా శుక్రవారం వరకు మూసివేయబడింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు.

"ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్న ఆకలి, దాహం, బాధ, అలసిపోయిన యాత్రికులను మానవీయ దృక్పథంతో చూడాలి. సాధారణ భక్తులు మనుషులు కాదా?" అని ప్రశ్నించారు. ఆదివారం నుండి సంగమం రోడ్డులో వందలాది వాహనాలు క్యూలో నిలబడి నత్తనడకన కదులుతున్నాయి. యాత్రికుల క్రమబద్ధమైన కదలిక కోసం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు సివిల్ లైన్స్‌కు కలుపుతుంది. ఎవరైనా దానిని ఎంచుకోకూడదనుకుంటే, వారు త్రివేణి సంగం చేరుకోవడానికి శాస్త్రి వంతెన మార్గాన్ని తీసుకోవచ్చు.

మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో "200-300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉన్నందున ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లడం అసాధ్యం" అని పోలీసులు తెలిపారు. జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి, 43 కోట్లకు పైగా భక్తులు సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆదివారం, అఖిలేష్ యాదవ్ ప్రయాగ్‌రాజ్‌లోని ట్రాఫిక్ పరిస్థితిని హైలైట్ చేస్తూ అనేక ట్వీట్‌లను పోస్ట్ చేశారు. చిక్కుకున్న యాత్రికులకు తక్షణ అత్యవసర ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.

"మహా కుంభమేళా సందర్భంగా, యుపిలో వాహనాలను టోల్ ఫ్రీగా చేయాలి. దీనివల్ల ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌ల సమస్య కూడా తగ్గుతుంది. సినిమాలను వినోద పన్ను రహితంగా చేయగలిగినప్పుడు, వాహనాలను టోల్ ఫ్రీగా ఎందుకు చేయకూడదు?" అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఒక పోస్ట్‌లో అన్నారు.

Next Story