ఓ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 30 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇందులో 28 మంది విద్యార్థులు కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ముంబైలోని కేఈఎం(కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్) మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివే 30 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు కళాశాల డీన్ డాక్టర హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. 30 మందిలో 23 మంది రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాగా.. మిగిలిన 7 గురు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులని అన్నారు.
వీరిలో ఇద్దరికి లక్షణాలు తీవ్రంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్చగా.. మిగిలిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. 30 మందిలో 28 మంది విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిసింది. కళాశాలలో మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కళాశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం కారణంగా వీరందరికీ కరోనా వ్యాపించి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. దీనిపై మేయర్ కిషోరి ఫడ్నేకర్ స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.