హెల్మెట్ లేకుండా ప్రయాణం అత్యంత ప్రమాదకరం.. అందుకే పోలీసులు ఎప్పటికప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రజలపై చర్యలు తీసుకుంటూ ఉంటారు. పెద్ద ఎత్తున ఫైన్స్ విధిస్తూ ఉంటారు. ఇక బైక్ పై ట్రిపుల్ రైడింగ్ అన్నది కూడా చేయకూడదు. దీనికి కూడా పోలీసులు జరిమానా విధిస్తూ ఉంటారు. అయితే కొందరు మహిళా పోలీసులు ఇలాంటి నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్డు మీదకు వచ్చారు. ఒక బైక్ లో ఏమో ముగ్గురూ వెళుతూ ఉండగా.. ఇంకో బైక్ లో వెనుక కూర్చున్న మహిళా పోలీసు హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో ఒక మహిళ నడిరోడ్డుపై వారిని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
మీరు పోలీసులు.. మీరే నిబంధనలు పాటించకుంటే ఎలా అంటూ మహిళా పోలీసులను కన్నడలో ప్రశ్నించింది. నిబంధనలు చెప్పే మీరు ఇలా నడిరోడ్డులో వెళ్లడం ఏ మాత్రం తగదు అంటూ చెప్పడంతో బైక్ పై ట్రిపుల్ రైడింగ్ వెళుతున్న వాళ్లు కిందకు దిగేశారు. ఇంకొక బైక్ మీద ఉన్న మహిళా పోలీసు అర్జెంట్ పని ఉంది అందుకే వెళుతున్నాము అని చెప్పగా.. అలాంటిదేమీ కుదరదు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటూ బుద్ధి చెప్పింది. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ట్రిపుల్స్.. పోలీసులు.. ఇదే ఉదాహరణగా మీరు ప్రజలకు చెబుతున్నారా అంటూ వీడియో వైరల్ చేస్తున్నారు.