కేరళలో పర్యాటకుల పడవ బోల్తా.. 21 మంది మృతి

కేరళలోని మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా

By అంజి  Published on  8 May 2023 7:30 AM IST
tourist boat, Kerala, Malappuram, Tanur, Chief Minister Pinarayi Vijayan

కేరళలో పర్యాటకుల పడవ బోల్తా.. 21 మంది మృతి

కేరళలోని మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా పడటంతో కనీసం 21 మంది మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు మునిగిపోయారు. బోటు కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. బోల్తా పడిన పడవను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవా సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు.

కాగా, మృతుల కుటుంబాలకు జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. "కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాము. మరణించిన ప్రతి కుటుంబానికి పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించబడుతుంది" అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో చెప్పారు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా మృతులకు సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. మలప్పురం జిల్లా కలెక్టర్‌ను సమన్వయంతో అత్యవసర రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించాలని ఆదేశించారు. అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న సీఎం రేపు ఉదయం తానూరుకు వెళ్లనున్నారు. టూరిజం మంత్రి పిఎ మహ్మద్ రియాస్‌తో కలిసి రెస్క్యూ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న కేరళ క్రీడా మంత్రి వి అబ్దురహిమాన్ మాట్లాడుతూ.. మరణించిన వారిలో ఎక్కువ మంది పాఠశాల సెలవుల కావడంతో రైడ్ కోసం వచ్చిన పిల్లలేనని చెప్పారు.

Next Story