2024 Elections: ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.. ఏయే పార్టీలు గెలిచాయంటే?

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ రాబోతోంది. 2024 సంవత్సరానికి ఎండ్‌ కార్డ్‌ పడబోతోంది. త్వరలోనే న్యూ ఇయర్‌ 2025లో అడుగుపెట్టబోతున్నాం.

By అంజి  Published on  12 Dec 2024 7:06 AM GMT
2024 Elections, states elections, Political parties, National news

2024 Elections: ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.. ఏయే పార్టీలు గెలిచాయంటే?

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ రాబోతోంది. 2024 సంవత్సరానికి ఎండ్‌ కార్డ్‌ పడబోతోంది. త్వరలోనే న్యూ ఇయర్‌ 2025లో అడుగుపెట్టబోతున్నాం. 2024 సంవత్సరం.. భారత్‌కు ఎన్నికల ఏడాది అందరికీ తెలిసిన విషయమే. మొత్తంగా 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల హోరు జోరుగా సాగింది. అయితే పార్టీల మేనిఫెస్టోలు, భారీ ప్రచారం, ఎగ్జిట్‌ పోల్స్‌ను తారుమారు చేసేలా ఫలితాలు వచ్చాయి. మరీ ఈ ఎన్నికల ఏడాదిలో దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయో, ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సంవత్సరం మొత్తం దేశంలోని 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, జమ్మూకశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ, దాని మిత్ర పక్షాలతో కలిసి ఐదు రాష్ట్రాల్లో తన కమలం జెండాను ఎగురవేసింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోగా.. ప్రేమాఖండు సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అటు సిక్కింలో ఏప్రిల్‌ 19న జరిగిన ఎన్నికల్లో క్రాంతికారీ మోర్చా మరోసారి గెలిచింది. దీంతో ప్రేమ్ సింగ్ తమంగ్ మళ్లీ సీఎం పదవిని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరగగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలిచింది. సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశాలో రెండు విడుతల్లో ఎన్నికల్లో జరిగాయి. మే 13న మొదటి విడత పోలింగ్‌, జూన్‌ 1న రెండో విడత పోలింగ్‌ జరిగింది. బీజూ జనతాదళ్‌ పార్టీని బీజేపీ ఓడించి.. నవీన్ పట్నాయక్‌ సుదీర్ఘ పాలనకు బ్రేక్‌ ఇచ్చింది. మోహన్ చరణ్ మాంఝీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టార.

జమ్మూకశ్మీర్‌లో కూడా రెండు విడతల్లో ఎన్నికల్లో జరిగాయి. సెప్టెంబరు 18 మొదటి ఫేజ్‌, అక్టోబరు 1 రెండో ఫేజ్‌ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు అక్కడ ప్రెసిడెంట్‌ రూల్‌ ఉండేది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచింది. ఒమర్ అబ్దుల్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలో అక్టోబరు 5న ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ని బీజేపీ ఓడించింది. నయాబ్‌ సింగ్‌ సైనీ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో నవంబరు 13, 20న ఎన్నికలు జరిగాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ కలిసి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. హేమంత్‌ సొరేన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో నవంబరు 20న ఎన్నికలు జరిగాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమి అయిన మహాయుతి గెలిచింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story