ప్రధాని మోదీ 2023 చివరి మన్‌కీబాత్.. ఏం చెప్పారంటే..
2023 ఏడాదికి సంబంధించి చివరి మన్‌కీబాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 7:55 AM GMTప్రధాని మోదీ 2023 చివరి మన్‌కీబాత్.. ఏం చెప్పారంటే..
ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదికి సంబంధించి చివరి మన్‌కీబాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాదిలో దేశం ఎన్నో విజయాలను సాధించిందని చెప్పారు. 2023 దేశ ప్రజల్లో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందనీ.. దాన్ని కొత్త ఏడాదిలో కూడా కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న మహిళా బిల్లుకు ఈ ఏడాదిలోనే ఆమోదం దొరకిందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. దీనిపై దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. భారత్ వేదికగా ప్రతిష్టాత్మక జీ20 సదస్సును విజయవంతం చేశామన్నారు. ఇక సినిమా రంగం విషయానికి వస్తే 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు దక్కవడం మంచి విషయమని చెప్పారు. ఆ పాట మన సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పార. ఎలిఫెండ్ విస్పరర్స్‌కు సైతం ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో భారతీయుల ప్రతిభ వెలుగు చూసిందని ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో చెప్పారు.
ఈ ఏడాది మన భారతీయ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను ఇచ్చారని చెప్పారు మోదీ. ఆసియా క్రీడల్లో 107, పారాగేమ్స్‌లో 111 పతకాలతో సత్తా చాటారని చెప్పారు. ఇక వన్డే వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా వచ్చి అందరి మనసులను గెలుచుకుందని చెప్పారు. చంద్రయాన్-3 విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల కృషితో ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతం అయ్యిందని చెప్పారు. అయోధ్యలో రామమందిరంపై దేశం మొత్తం ఉ్తసుకతతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడు, అయోధ్యపై కొత్త పాటలు, భజనలు, కవితలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కళా ప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అయ్యిందని చెప్పారు ప్రధాని మోదీ.