తీవ్రమవుతున్న బొగ్గు కొరత.. 20 థర్మల్ పాంట్లు మూత..!
20 Thermal power stations shut.ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరినీ విద్యుత్ సంక్షోభం కలవర పెడుతోంది. బొగ్గు కొరత కారణంగా
By అంజి Published on 12 Oct 2021 2:15 AM GMTఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరినీ విద్యుత్ సంక్షోభం కలవర పెడుతోంది. బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్‌లో సరఫరాకు, డిమాండ్ మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. మరో వైపు దేశంలో ఇప్పటికే చాలా చోట్ల బోగ్గు నిల్వలు అయిపోతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. బొగ్గు కొరత కారణంగా దాదాపు 20 థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేశారు. ఈ జాబితాలో మహారాష్ట్రలోని 13, కేరళలో 4, పంజాబ్‌లో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ రాష్ట్రంలో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటి పోయాయని, వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు బొగ్గును సరఫరా చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, ఏపీ సీఎం జగన్‌లు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, కేరళ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్పత్తి తగ్గడంతో కోతలు అనివార్యం కావొచ్చని, ప్రజలు ఇందుకు సహకరించాలని అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అక్కడి వార్తా పత్రికల్లో ప్రకటలను ఇచ్చింది.
ఇక ఏపీలో గత మూడు రోజులుగా పలు చోట్ల విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఇంధన కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలను ఆపేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు. పైకి దేశవ్యాప్తంగా ఎలాంటి విద్యుత్ సమస్య లేదని కేంద్రం చెబుతున్నప్పటికి.. లోలోపల మాత్రం పెద్ద చర్చే జరుగుతున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశంముందంటూ ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలు, ఎన్టీపీసీకి చెందిన సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. వీరి భేటీ దాదాపు గంటపాటు సాగింది. దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరా, డిమాండ్‌ల మధ్య అంతరంపై చర్చించినట్లు సమాచారం. గడిచే మూడు రోజుల్లో బొగ్గు నిల్వలు అయిపోయే థర్మల్ విద్యుత్ కేంద్రాల సంఖ్య 74కు పెరగనుంది. మరోవైపు విద్యుత్ నష్టాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.