ముగిసిన 17వ లోక్‌సభ చివరి సమావేశాలు
పదిహేడవ లోక్‌సభ చివరి సమావేశాలు శనివారం ముగిశాయి.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 8:18 PM ISTముగిసిన 17వ లోక్‌సభ చివరి సమావేశాలు
పదిహేడవ లోక్‌సభ చివరి సమావేశాలు శనివారం ముగిశాయి. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌లో ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తాజాగా శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా త్వరలోనే లోసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే 17వ లోక్‌సభ చివరి సమావేశాలు ముగిసినట్లు అయ్యింది.
పదిహేడవ లోక్‌సభలో ఈ ఐదేళ్లలో మొత్తం 222 బిల్లులకు ఆమోదం లభించినట్లు స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. సమావేశాల చివరి రోజున రామమందిరం నిర్మాణంపై చర్చ కొనసాగింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షా సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్లలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. సమావేశాల ముగింపు సందర్భంగా ఓంబిర్లా మాట్లాడారు. అధికార, విపక్ష బెంచ్‌లను సమానంగా చూసినట్లు చెప్పారు. అలాగే సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచిన పార్టీగా బీజేపీ అవతరించింది. 303 సభ్యులు బీజేపీ నుంచే గెలిచారు. అయితే.. ప్రస్తుతం ఆ పార్టీ సంఖ్యాబలం 290కి తగ్గింది. కానీ పార్లమెంట్‌లో మాత్రం కాషాయ పార్టీకే అత్యధిక సభ్యులు ఉన్నారు. 2019లో జాతీయ పార్టీల నుంచి మొత్తం 397 మంది ఎంపీలు ఎన్నిక అయ్యారు. కాంగ్రెస్‌ను గెలిచిన వారు 52 మంది సభ్యులు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 48కి తగ్గింది. ఇక టీఎంసీకి 22, డీఎంకే 24 మంది సభ్యులుఉన్నారు. మొత్తం గెలిచిన సభ్యుల్లో 260 మంది ఎంపీలు తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికవారే కావడం గమనార్హం.