2024లో బీజేపీని ఓడించాలని 17 ప్రతిపక్ష పార్టీల తీర్మానం
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని, విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని
By News Meter Telugu Published on 24 Jun 2023 3:31 AM GMT2024లో బీజేపీని ఓడించాలని 17 ప్రతిపక్ష పార్టీల తీర్మానం
పాట్నా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని, విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని 17 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం తీర్మానించుకున్నాయి. ఢిల్లీ పరిపాలనా సేవలపై ఆర్డినెన్స్‌ను బహిరంగంగా ఖండించడానికి కాంగ్రెస్ నిరాకరించిందనే కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విలేకరుల సమావేశంలో భాగం కాలేదు. కాంగ్రెస్ మౌనం అనుమానాలు కలిగిస్తోందని ఆప్ ఒక ప్రకటనలో పేర్కొంది.
బ్లాక్ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకం, పూర్తిగా అప్రజాస్వామికమని ఆప్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని కూడా చెబుతోంది. "కాంగ్రెస్ ఈ విషయంలో మాట్లాడడానికి నిరాకరించడం, ఇలాంటి ముఖ్యమైన సమస్యపై కాంగ్రెస్ సరిగా స్పందించకపోవడంతో.. ఆ పార్టీ ఉన్న ఏదైనా కూటమిలో భాగం కావడం AAPకి చాలా కష్టతరం చేస్తుంది" అని అది ఆప్ ప్రకటన తెలిపింది.
దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో 17 పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు, కలిసి పోరాడే ప్రణాళికకు తుది రూపం ఇచ్చేందుకు రానున్న కొద్ది రోజుల్లో నేతలు మరోసారి సమావేశమవుతారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. "మేము కీలక సమావేశం నిర్వహించాము. సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 17 పార్టీలు కలిసి పని చేయాలని, లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి" అని ఆయన చెప్పారు.
ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తాము జాతీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని, దేశ చరిత్రను మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వచ్చే నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో విపక్ష నేతల తదుపరి సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఉమ్మడి ఎజెండాను సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నామని, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వచ్చే సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మాకు కొన్ని విభేదాలు ఉండవచ్చు, అయితే కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాము. మా భావజాలాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాము" అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ పాట్నాలో ఏది ప్రారంభమైనా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని.. అందుకోసమే పాట్నాలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. "మేమంతా ఐక్యంగా ఉన్నాము. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతాము" అని ఆమె అన్నారు. తాము ప్రతిపక్ష పార్టీలమేనని, దేశభక్తి ఉన్న దేశ పౌరులమని, భారత్ మాతను ప్రేమించే వాళ్లమని ఆమె చెప్పారు.
పెళ్లి చేసుకో: రాహుల్‌కి లాలూ సూచన
పెళ్లి చేసుకోడానికి నిరాకరిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ఇకనైనా పెళ్లి చేసుకోవాలని సూచించారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నారు.
ప్రతిపక్షాల సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించిన లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి లాగే నవ్వులు పూయించారు. "పెళ్లి చేసుకోమని మా సలహాను మీరు పట్టించుకోవడం లేదు.. మీరు పెళ్లికి నిరాకరించినందుకు మీ మమ్మీ బాధపడుతూనే ఉంటుంది" అని లాలూ అన్నారు. "మేము మీ వివాహ ఊరేగింపులో భాగం కావాలని కోరుకుంటున్నాము" అని చెప్పడంతో.. రాహుల్ గాంధీ సిగ్గుతో కూడిన చిరునవ్వు నవ్వారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ చేసిన యాత్రను లాలూ ప్రశంసించారు.