సీఎం నివాసంలో కరోనా కలకలం.. భార్య, పిల్లలు సహా 15 మందికి పాజిటివ్
15 People test Covid positive at Jharkhand CM's residence.దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 9 Jan 2022 6:29 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరైన్ ఇంట్లో కరోనా కల్లోలం రేపింది. ముఖ్యమంత్రి భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మొత్తం 15 మంది కరోనా బారిన పడ్డారు. కాగా.. సీఎం హేమంత్ సోరేన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది.
రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వారిలో 24 మంది ఫలితాలు శనివారం సాయంత్రం వచ్చాయని అందులో 15 మందికి కరోనా పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చినట్లు చెప్పారు. సీఎం భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ము లు కరోనా బారిన పడినవారిలో ఉన్నట్లు తెలిపారు. సీఎం నివాసంలో ఉన్న వారందరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. వారంతా సెల్ప్ క్వారంటైన్ అయినట్లు చెప్పారు.
జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా సైతం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. శనివారం పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన జంషెడ్‌లోని తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో శనివారం 5,081 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,74,000కు చేరింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5,164 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 347,866 ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,098 యాక్టివ్ కేసులున్నాయి.