ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో కొన్ని దగ్ధమయ్యాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా కూడా పరిస్థితి అదుపులో ఉందని, ఘటన జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి తీసుకోవడంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ హింసాత్మక ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 8 మంది పోలీసులు, ఒక పౌరుడు ఉన్నాడని అధికారులు తెలిపారు.
హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మంది అరెస్ట్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించామని ఢిల్లీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ హింసాకాండకు సంబంధించి దాదాపు 100 సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ అల్లర్లకు కారకులైన మరికొంత మందిని గుర్తిస్తామని అధికారులు తెలిపారు. స్పెషల్ టీమ్, స్పెషల్ సెల్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ అల్లర్లకు కారకులైన వారిని ఉపేక్షించేది లేదని పోలీసులు అంటున్నారు.