ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలి 12 మంది మృతి
12 Killed In Fire At Chemical Factory in UP's Hapur.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కెమికల్
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2022 4:34 AM GMTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, మరో 21 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలో ఉంది.
వివరాల్లోకి వెళితే.. హాపూర్ జిల్లా ధౌలానాలోని పారిశ్రామిక ప్రాంతంలో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసే ఓ కంపెనీలో శనివారం బాయిలర్ పేలింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడు ధాటికి 12 మంది మరణించగా.. మరో 21 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు హాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ దీపక్ భుకర్ తెలిపారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న పలు ఫ్యాక్టరీల పై కప్పులు ఎగిరిపోయాయి.
"ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయడానికి లైసెన్స్ ఇవ్వబడింది. ఇప్పుడు, ఇక్కడ సరిగ్గా ఏమి జరుగుతుందో దర్యాప్తు చేయాల్సిన విషయం. ఇది విచారకరమైన సంఘటన. ఫోరెన్సిక్ బృందాలు ఇక్కడకు చేరుకుని నమూనాలను సేకరిస్తున్నాయి," హాపూర్ మేధా జిల్లా మేజిస్ట్రేట్ రూపమ్ తెలిపారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
'ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పాల్గొంటోంది. '' అని మోదీ ట్వీట్ చేశారు.