మందుబాబులకు వింత శిక్ష.. 1000 సార్లు రాయించారు
1000 Times imposition for Bus Drivers caught drunk driving.మద్యం తాగి వాహనాలను నడపడం నేరం.
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2023 4:50 AM GMTమద్యం తాగి వాహనాలను నడపడం నేరం. మద్యం తాగి వాహనాలు నడిపితే యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. తాగి వాహనాలు నడిపే వ్యక్తి ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. దీంతో కేరళ పోలీసులు మందుబాబులకు వింత శిక్ష విధించారు. మందుబాబులను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఇంపోజిషన్ రాయించారు.
ఆదివారం రోజున కొచ్చిలో ఓ ప్రైవేటు బస్సు ఢీ కొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాటును త్రిపునితుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్కడ వింత శిక్ష విధించారు. "ఇకపై తాగి డ్రైవింగ్ చేయను" అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు. చేసిది లేక మందుబాబులంతా పోలీస్ స్టేషన్‌లో నేల మీద కూర్పోని ఇంపోజిషన్ రాశారు. ఇంపోజిషన్ రాసినప్పటికి అసలు శిక్ష తప్పదని పోలీసులు తెలిపారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు సస్పెండ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.