బెంగళూరు బంద్‌.. 1000 మంది అరెస్ట్

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘాలు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో 'కర్ణాటక జల సంరక్షణ సమితి' పిలుపునిచ్చింది.

By Medi Samrat  Published on  26 Sept 2023 5:17 PM IST
బెంగళూరు బంద్‌.. 1000 మంది అరెస్ట్

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘాలు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో 'కర్ణాటక జల సంరక్షణ సమితి' పిలుపునిచ్చింది. పోలీసులు మాత్రం ఈ బంద్ కు అనుమతులు లేవని చెప్పారు. అయితే ఈ బంద్‌లో పాల్గొన్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 1,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద మాట్లాడుతూ నగరమంతటా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని తెలిపారు. వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 1,000 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆంక్షలు, కోర్టు ఆదేశాల ప్రకారం నగరంలో ఎలాంటి బంద్‌, ఊరేగింపులకు అనుమతి లేదని దయానంద తెలిపారు.

బంద్‌ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 144 విధించారు. ఈరోజు నగరంలో ఊరేగింపులకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. బంద్‌ నేపథ్యంలో మంగళవారం నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. నగరంలోని చాలా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు సోమవారం విద్యార్థులకు సెలవు ప్రకటించాయి. బెంగళూరులో మెట్రో సేవలు బంద్ పిలుపుతో స్వల్పంగా ప్రభావితమయ్యాయి.

Next Story