ఇఫ్తార్ తిని 100 మందికి పైగా అస్వస్థత
రంజాన్ ప్రార్థన తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని ఒక మసీదులో ఇఫ్తార్ తిన్న వంద మందికి
By అంజి Published on 26 March 2023 3:00 PM ISTఇఫ్తార్ తిని 100 మందికి పైగా అస్వస్థత
రంజాన్ ప్రార్థన తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని ఒక మసీదులో ఇఫ్తార్ తిన్న వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కోల్‌కతాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ సంఘటన కుల్తాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పఖిరాలయ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరికి వైద్యం అందిస్తున్న వైద్యుల్లో ఒకరు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు.
''నిన్న రాత్రి కొంతమంది అనారోగ్యంతో ఉన్నవారు వాంతులు, కడుపు నొప్పితో నా నర్సింగ్‌హోమ్‌లోకి వచ్చారు. ఉపవాసం తర్వాత భోజనం చేసిన ఇఫ్తార్ విందులో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ సంఘటన జరిగిందని మేము భావిస్తున్నాము'' అని డాక్టర్ హోరిసాధన్ మోండల్ చెప్పారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి జీవిత భాగస్వామి నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజున, చాలా మంది స్థానికులు తమ ఉపవాసాన్ని ముగించడానికి స్థానిక మసీదుకు చేరుకున్నారు.
అక్కడ ఇఫ్తార్ విందుకు హాజరైన వారు.. అనారోగ్యానికి గురయ్యారు. శనివారం నాటికి, సంఖ్య పెరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.