మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. ఆ పని చేస్తే మ‌ద్యంపై 10శాతం రాయితీ

10 Percent discount on liquor to Fully Vaccinated in MP.మందుబాబుల‌కు నిజంగా ఇది శుభవార్త‌. మ‌ద్యం కొనుగోలు పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2021 8:44 AM IST
మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. ఆ పని చేస్తే మ‌ద్యంపై 10శాతం రాయితీ

మందుబాబుల‌కు నిజంగా ఇది శుభవార్త‌. మ‌ద్యం కొనుగోలు పై 10 శాతం రాయితీ అందిస్తున్నారు. మీరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌ట్ల‌యితే ఈ ఆఫ‌ర్ మీకు వ‌ర్తిస్తుంది. అయితే.. ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఓ ప‌ట్ట‌ణంలో ఎక్సైజ్ అధికారులు ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్నారు. వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను మ‌రింత పెంచేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రెండు డోసుల టీకాలు వేయించుకున్న వారికి దేశీయ మ‌ద్యంపై 10శాతం రాయితీని అందిస్తున్న‌ట్లు మంద‌సౌర్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి అనిల్ సచన్ తెలిపారు.

వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు స‌ర్టిఫికేట్ చూపించి 10శాతం రాయితీపై దేశీయ మ‌ద్యాన్ని కొనుగోలు చేయొచ్చున‌ని తెలిపారు. సీతామౌ ఫటక్, భునియాఖేడి మరియు పాత బస్టాండ్‌లో ఉన్న మూడు దుకాణాలలో ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌న్నారు. డిస్కౌంటు నిర్ణ‌యంతో ఆయా మ‌ద్యం దుకాణాల వ‌ద్ద మందుబాబుల ర‌ద్దీ పెరిగింది. ఈ ప్ర‌యోగం విజ‌యవంతం అయితే.. జిల్లాలోని ఇత‌ర ప్రాంతాల్లో కూడా దీన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు అనిల్ స‌చ‌న్ తెలిపారు.

అయితే.. ఈ చర్య ప్రజలను మద్యం సేవించేలా ప్రోత్సహిస్తుందని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. కాగా.. దీనిపై ఎమ్మెల్యే య‌శ్‌పాల్ సింగ్ సిసోడియా ట్విట‌ర్ ద్వారా స్పందించారు. ఈ రాయితీ నిర్ణ‌యం ప్ర‌భుత్వం తీసుకుంది కాద‌న్నారు. ఇది ప్ర‌జ‌ల‌ను మ‌ద్యం తాగేలా ప్రోత్స‌హిస్తుంద‌న్నారు. ఇది స‌రైంది కాద‌న్నారు.

Next Story