పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్రికులతో వెలుతున్న ట్రక్కు విద్యుదాఘానికి గురై 10 మంది మరణించారు. ఈ ఘటన కూచ్‌బెహార్‌లో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మరో 19 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం జల్పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై మఠభంగ అడిషనల్ ఎస్పీ అమిత్ వర్మ మాట్లాడుతూ.. మెల్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్ల వంతెన వద్ద జల్పేష్‌కు వెలుతున్న వాహనం విద్యుధాఘాతానికి గురైంది. డీజే సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగా ఇది జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారణ అయింది. కన్వారియాలందరూ శీతల్‌కుచి పోలీస్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.