రాళ్ల ఉప్పులో 2700 కోట్ల విలువైన డ్రగ్స్.. ఛీతా అరెస్ట్

By సుభాష్  Published on  9 May 2020 2:59 PM GMT
రాళ్ల ఉప్పులో 2700 కోట్ల విలువైన డ్రగ్స్.. ఛీతా అరెస్ట్

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ.) శుక్రవారం నాడు అత్యంత ప్రమాదకరమైన మోస్ట్ వాంటెడ్ నార్కో టెర్రరిస్ట్(డ్రగ్స్ డాన్) రంజిత్ సింగ్ ను పట్టుకున్నారు. హర్యానా లోని సిర్సాలో పోలీసులు జరిపిన సోదాలలో రంజిత్ సింగ్ పట్టుబడ్డాడని హర్యానా పోలీసులు తెలిపారు.

రంజిత్ సింగ్ ను ఛీతా అని కూడా అంటారు. ఎంతో మందికి డ్రగ్స్ కు సప్లై చేసి వారి జీవితాలను నాశనం చేసిన పెద్ద క్రిమినల్ రంజిత్ సింగ్. ఇటువంటి వ్యక్తి పట్టుబడడంతో చాలా మందిలో గుబులు రేపుతోంది. పలువురు ప్రముఖులకు ఇతనితో లింక్ లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రంజిత్ సింగ్ తో పాటూ ఇక్బాల్ షేరా సింగ్ ను కూడా పోలీసులు పట్టుకున్నారు.

పాకిస్థాన్ నుండి వచ్చిన 532కేజీల హెరాయిన్ ను దాచిన కేసులో రంజిత్ సింగ్ ప్రధాన నిందితుడు. ఈ కేసును ఎన్.ఐ.ఏ. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు సంవత్సరం నుండి రంజిత్ సింగ్ పరారీలో ఉన్నాడు. దాదాపు రూ.2700 కోట్ల విలువ గల 532 కేజీల హెరాయిన్‌ తరలిస్తున్న కేసులో అతను నిందితుడు. జూన్ 29, 2019న రాళ్ల ఉప్పు మధ్యన హెరాయిన్ ను తరలిస్తూ పాకిస్థాన్ నుండి భారత్ కు తీసుకుని వస్తూ ఉండగా ఐసిపి అటారీ వద్ద దొరికిపోయింది.

అతి పేద నెట్వర్క్, కస్టమ్స్ లో అతని ఏజెంట్స్.. ఏదైనా సరే ట్రాన్స్ పోర్ట్ చేయగలిగిన వ్యక్తులు.. హవాలా ద్వారా అతనికి అండగా నిలిచిన బడా బడా బిజినెస్ మ్యాన్లు, అండర్ వరల్డ్ డాన్ లు.. రంజిత్ సింగ్ సామ్రాజ్యంలో ఉన్నవాళ్లే. పట్టుబడిన 532 కేజీలు.. మొత్తం అయిదు ప్యాకేజీలలో ఒక ప్యాకేజీ మాత్రమేనని కూడా చెబుతారు. నాలుగు ప్యాకేజీలను అతడు విజయవంతంగా భారత్ లోకి స్మగ్లింగ్ చేసేశాడట..! రంజిత్ సింగ్ మీద మొదటి ఛార్జ్ షీట్ ను డిసెంబర్ 27, 2019న స్పెషల్ ఎన్.ఐ.ఏ. కోర్ట్, మొహాలీ లో సబ్మిట్ చేశారు. అందులో మొత్తం 15 మందిని, నాలుగు కంపెనీలను నిందితులుగా చేర్చారు. అప్పటి నుండి రంజిత్ సింగ్ తప్పించుకుని తిరుగుతున్నాడు.

రంజిత్ సింగ్ కు తీవ్రవాదులతో కూడా లింక్ లు ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు ఫండింగ్ అందించినట్లు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ నార్కో టెర్రరిస్టు అయిన రంజిత్ సింగ్ ను అరెస్టు చేయడం ద్వారా చాలా సమాచారం రాబట్టే అవకాశం ఉందని ఎన్.ఐ.ఏ. అధికారులు ఆశిస్తున్నారు.



Next Story