కుటుంబ ఆస్తులను వెల్లడించిన 'నారా లోకేష్'
By సుభాష్
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తులను ప్రకటించారు. మార్కెట్ వాల్యూ ప్రకారమే ఆస్తులను వెల్లడిస్తున్నట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. గత 25 ఏళ్ల క్రితమే హెరిటేజ్‌ని స్థాపించామని, హెరిటేజ్ ద్వారా గత ఏడాది రూ.83 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. హెరిటేజ్ ద్వారా నేరుగా 3వేల మందికి ఉపాధి లభిస్తోందని, నారా భువనేశ్వరి, ఆయన భార్య బ్రాహ్మణి ఇద్దరూ హెరిటేజ్ కోసం పని చేస్తున్నారన్నారు.
ప్రతి యేటా ఆస్తులను ప్రకటిస్తున్నాం..
గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి ఏటా తమ ఆస్తులను ప్రకటిస్తున్నామని లోకేష్ చెప్పారు. మమ్మల్ని విమర్శించే ముందు మీ ఆస్తులను ప్రకటించండి అంటూ.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఇక లోకేష్ ప్రకటించిన ఆస్తులను పరిశీలిస్తే..
చంద్రబాబు ఆస్తులు
చంద్రబాబు ఆస్తులు గత ఏడాది కంటే రూ. 87 లక్షలు పెరిగాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు రూ.70 లక్షలు పెరిగింది. ఇక బ్యాంకు రుణాలు రూ. 18 లక్షలు తగ్గాయి. చంద్రబాబు ఆస్తి విలువ రూ.9 కోట్లు, అప్పులు రూ.5 కోట్ల 13 లక్షలు, నికర ఆస్తులు రూ.3 కోట్ల 87 లక్షలు.
భువనేశ్వరి ఆస్తులు
నారా భువనేశ్వరి ఆస్తి పీఎఫ్ ఖాతాలో రూ.40 లక్షలు, బ్యాంకు ఖాతాల్లో రూ.1 లక్ష 30వేలు పెరిగాయి. ఇతర నగదు రూ. 3 కోట్ల, 16 లక్షలు తగ్గింది. ఇక మొత్తంగా ఆమె ఆస్తులు రూ. 53 కోట్ల, 37 లక్షల నుంచి రూ.50 కోట్ల 62 లక్షలు తగ్గాయి. ఇక అప్పులు రూ.22 కోట్ల 35 లక్షల నుంచి రూ.11 కోట్ల 4 లక్షలకు తగ్గాయి.
లోకేష్ ఆస్తులు
లోకేష్ ఆస్తులను పరిశీలిస్తే.. హోల్డింగ్‌లో షేర్లను బ్రాహ్మణికి గిఫ్ట్ గా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర నగదు రూ.9 కోట్ల 53 లక్షల నుంచి రూ. 8 కోట్ల 14 లక్షలకు తగ్గాయి. ఇక బ్యాంకు సేవింగ్ అకౌంట్లో రూ. 43 లక్షలు పెరిగాయి. మొత్తం ఆస్తులు రూ. 27 కోట్ల 29 లక్షల నుంచి రూ.24 కోట్ల 70 లక్షలకు తగ్గాయి. అప్పులు రూ.5 కోట్ల 80 లక్షల నుంచి రూ.5 కోట్ల 70 లక్షలకు తగ్గాయి. నికర ఆస్తులు రూ.2 కోట్ల 40 లక్షలు తగ్గాయి.
బ్రాహ్మణి ఆస్తులు
ఇక బ్రాహ్మణి ఆస్తులు రూ.1 లక్ష 62 వేల నిర్వాణ షేర్ల ద్వారా పెరిగింది. ఎల్‌ఐసీ రూ.6 లక్షలు పెరిగాయి. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో బ్యాలెన్స్ రూ. 38 లక్షల నుంచి రూ.57 లక్షలకు పెరిగింది. ఇతర ఆస్తులు రూ.39 లక్షల నుంచి రూ.81 లక్షలకు పెరిగాయి. ప్రస్తుతమున్న ఆస్తులు రూ.11 కోట్ల 38 లక్షల నుంచి రూ.15 కోట్ల 68 లక్షలకు పెరిగాయి. అప్పులు రూ.5 కోట్ల66 లక్షల నుంచి రూ.4 కోట్ల 17 లక్షలకు తగ్గాయి. ఇక బ్రాహ్మణి నికరాస్తులు రూ. 7 కోట్ల 72 లక్షల నుంచి రూ. 11కోట్ల 51 లక్షలకు పెరిగాయి. ఏడాదిలో నికరాస్తులు రూ.3 కోట్ల 81 లక్షలు పెరిగాయి.
దేవాన్ష్ ఆస్తులు
తన కొడుకు దేవాన్ష్ ఆస్తులను కూడా వెల్లడించారు. ఫిక్స్ డ్ డిపాజిట్లు రూ. 2 కోట్ల 49 లక్షల నుంచి రూ.3 కోట్ల 18 లక్షలకు పెరిగాయి. బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూ.70వేలు పెరిగాయి. గత ఏడాది దేవాన్ష్ ఆస్తులు రూ. 18 కోట్ల 71 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.19 కోట్ల 42 లక్షలకు చేరాయి. మొత్తం మీద ఈ ఏడాది దేవాన్ష్ ఆస్తులు రూ.41 లక్షలు పెరిగాయి.