ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది వలస కూలీలు మృతి.. 22 మందికి తీవ్ర గాయాలు

By సుభాష్  Published on  1 Jun 2020 12:48 PM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది వలస కూలీలు మృతి.. 22 మందికి తీవ్ర గాయాలు

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని బస్సు ఢీకొనడంతో 12 మంది వలస కూలీలు మృతి చెందగా, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూలీలంతా భారత్‌ నుంచి నేపాల్‌లోని స్వస్థలాలకు వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో లాక్‌డౌన్‌ కారణంగా నేపాలి వలస కూలీలు భారత్‌లోనే ఉండిపోయారు. నేపాల్‌లోని బాంకే జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని సల్యాన్‌ జిల్లాకు చెందిన కొంత మంది ఉపాధి కోసం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు వలస వచ్చారు.

కరోనాతో లాక్‌డౌన్‌ ఉన్నందున పనులు లేక స్వస్థలాలకు వెళ్లేందుకు బయలుదేరారు. అధికారుల అనుమతితో ఒక బస్సులో 30 మందికిపైగా వలస కార్మికులు నేపాల్‌కు బయలుదేరారు. అర్ధరాత్రి సమయం తర్వాత నేపాల్‌లోని బాంకే జిల్లాలో ఆగివున్న లారీని కూలీలు ప్రయాణిస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగడానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story