“15 సంవత్సరాలైందా మా పెళ్లి అయి..? ఇంకా మేమిద్దరం డీప్ లవ్ లో ఉన్నాం.. ఇప్పటికీ మేమిద్దరం ప్రణయకాలంలోనే ఉన్నామని” ఎంతో ఆనందంగా చెప్పింది సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. పెళ్లి అయ్యాక మా ఇద్దరి మధ్య బంధం మరింత బలమైందని ఆమె అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలు లేని భార్యాభర్తల లిస్టులో తాము మొదటి స్థానంలో ఉంటామని నమ్రత బలంగా నమ్ముతోంది. తన చుట్టూ ఉన్న ఎన్నో జంటల పెళ్లిళ్లు వేరే ట్రాక్ లో వెళ్లడం తాను చూశానని.. కానీ తమది అలాంటి లిస్టులో ఉండదని చెప్పారు.

తమ లవ్ స్టోరీ గురించి కూడా నమ్రత ప్రస్తావించారు. మహేష్ బాబు సాధారణంగా సెట్స్ లో షాట్ అయ్యాక తన హీరోయిన్స్ తో కనీసం మాట్లాడాడు.. ఆ పక్కకు కూడా చూసే వాడు కాదు.. కానీ తనతో మాట్లాడేవాడు అంటే అది తన మీద అతనికి ఉన్న నమ్మకం అని.. తనను నమ్మాడు కాబట్టే మాట్లాడేవాడని నమ్రత చెప్పారు.

తామిద్దరం ప్రేమలో పడ్డాక పెళ్లి చేసుకోడానికి నాలుగేళ్లు పట్టిందని.. మహేష్ ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి తనను పెళ్లి చేసుకున్నాడని నమ్రత అన్నారు. తాను మొదటి సారి మహేష్ బాబును కలిసింది.. ‘వంశీ’ సినిమా సెట్స్ లో..! ఆ సినిమా మా ఇద్దరి కెరీర్లలో చెత్త సినిమా.. అయినా ఆ సినిమా చేసినందుకు తనకేమీ బాధ లేదని.. ఆ సినిమా లేకపోయి ఉంటే మహేష్ ను తాను కలిసేదాన్ని కాదని చెప్పుకొచ్చారు. అలా వంశీ తమ జీవితాల్లో స్పెషల్ అని అన్నారు. మహేష్ ను మొదటిసారి కలిసినప్పుడే ఈ వ్యక్తితోనే తాను జీవితాంతం గడపబోయేది అన్న ఫీలింగ్ తనకు వచ్చిందని.. ఆ తర్వాత ఇద్దరి ప్రేమ అలా చిగురించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని చెప్పుకొచ్చారు.

మహేష్ తమ కుటుంబ సభ్యులకు నా గురించి చెప్పారని.. తనకు వ్యతిరేకంగా మహేష్ కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు కానీ.. ఇంతకూ నేనెవరో.. ఏమి చేస్తానో.. నా కుటుంబం ఎలాంటిదో.. మహేష్ కు నేను కరెక్ట్ కాదా అని వాళ్ళు కూడా అనుకోవడం సహజమే అని నమ్రత అన్నారు. మహేష్ అందరినీ ఒప్పించి తమ పెళ్లి చేసుకోడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. తనను కలుసుకునే సమయంలో ఉండే ఫీలింగ్స్ ఎప్పటికీ మరవలేనని అన్నారు. ఒకటి మాత్రం తాము బలంగా నమ్మే వాళ్లమని.. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని నేను.. నమ్రతనే చేసుకోవాలని మహేష్ అనుకునే వాళ్ళమన్నారు.

 

15 సంవత్సరాల దాంపత్య జీవితం ఎప్పుడు గడిచిపోయిందో అర్థం కాదని.. ఎప్పుడు నిద్ర లేచానో.. ఎప్పుడు నిద్రపోయానో కూడా అసలు గుర్తులేదన్నారు. తాను ఇంకే జీవితం కోరుకోలేదని.. నా భర్త- నా ఇద్దరు పిల్లలే నా ప్రపంచం అని.. ఏది చేసినా వీరితోనే అని అన్నారు నమ్రత. తన ఫ్రెండ్స్ తో కూడా ఉండాలని ఎప్పుడూ అనుకోనని.. మహేష్ బాబునే అట్టి పెట్టుకుని ఉండడం తనకు చాలా ఇష్టమని ఆమె అన్నారు. తాను మహేష్ చేసే యాడ్స్ విషయంలో మాత్రమే దృష్టి పెడతానని.. సినిమా స్క్రిప్ట్స్ సెలెక్షన్స్ లో అసలు వేలు పెట్టనని అన్నారు. తాను మహేష్ బాబు చేసే సినిమాల స్క్రిప్ట్స్ గురించి పట్టించుకుంటాననే వదంతులు అసలు నమ్మకండని.. తనకే కానీ స్క్రిప్ట్స్ సెలెక్షన్స్ లో అంత పట్టు ఉండి ఉంటే తన బాలీవుడ్ కెరీర్ లో అన్ని చెత్త సినిమాల్లో పని చేసి ఉండేదాన్ని కాదని నవ్వేశారు నమ్రత. మహేష్ బాబుతో తన జీవితం ఓ కలలా ఉందని.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె అన్నారు. తమ పిల్లలు కూడా పెద్దయ్యాక తమ లాగే పెళ్లి అన్న సంప్రదాయాన్ని నమ్మాలని కోరుకుంటున్నానన్నారు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాలను జరుగుతూ ఉంటాయని.. నేను మహేష్ వాటిని అసలు పట్టించుకోమని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.