హైకోర్టు ఆదేశాలు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రత్యేక ఏర్పాట్లు
By అంజి Published on 22 Dec 2019 11:11 AM GMT
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. గత ఏడాది జరిగిన అగ్నిప్రమాదంలో బాధితులకు ఎలాంటి పరిహారం ఇచ్చారో తెలపాలని పిటిషన్ దాఖలు అయ్యింది. గత సంవత్సరం నుమాయిష్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. అయితే బాధితులకు ఎలాంటి పరిహారం ఇచ్చారు, సెక్యూరిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఈ అంశాలన్నింటీని తెలపకుండానే జనవరి నుంచి నుమాయిష్ ఏర్పాటు చేయాలని పిటిషనర్లు ఆరోపించారు. కాగా దీనిపై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. సీపీ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను పరిశీలించాలని ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాతే ఎగ్జిబిషన్ కు అనుమతి ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఈ నేపథ్యంలో సీపీ అంజనీకుమార్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పర్యవేక్షించారు. గత ఏడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ప్రదర్శన గ్రౌండ్ లో ప్రమాదాలను నివారించేందుకు ఫైర్ హైడ్రాన్ట్స్ ఏర్పాటు చేశామని, ఫైర్ ఇంజిన్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోనే ఉంచుతామని అంజనీ కుమార్ తెలిపారు.
గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లేందుకు తొమ్మిది మార్గాలు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే 1.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు నీటి ట్యాంక్ లను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 45 రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం అవుతుంది. పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్ సందర్శకులు తరలివస్తారు.