నమస్తే ట్రంప్‌: 22 కి.మీ. రోడ్‌ షోకు ఏర్పాట్లు..!

By అంజి  Published on  19 Feb 2020 6:29 AM GMT
నమస్తే ట్రంప్‌: 22 కి.మీ. రోడ్‌ షోకు ఏర్పాట్లు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన భారత పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పెద్ద ఒప్పందాన్ని ఆదా చేస్తున్నామని వెల్లడించారు. మోదీ అంటే తనకు ఇష్టమన్నారు. భారత్‌లో తనకు 7 మిలియన్ల మంది స్వాగతం పలుకుతారని మోదీ చెప్పారని ట్రంప్‌ అన్నారు. భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. కాగా ట్రంప్‌ వ్యాఖ్యలతో వాణిజ్య ఒప్పందంపై అనుమానాలు నెలకొన్నాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా మన దేశంలో పర్యటించనున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో భార్య మెలానియాతో కలిసి ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో పర్యటిస్తారు. భారత పర్యటనలో డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆగ్రాకూ వెళ్లనున్నారు. ఆయన తన భార్యతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. ఈ నెల 24న ట్రంప్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 22 కి.మీ మేర రోడ్‌ షో కొనసాగనుంది.

రోడ్‌ షోలో భారీ సంఖ్యలో ప్రజలు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి సబర్మతి ఆశ్రమానికి వెళ్తారు. ఆ తర్వాత క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం ట్రంప్‌ తన భార్యతో కలిసి నేరుగా ఆగ్రా వెళ్తారు. అక్కడ వారికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ స్వాగతం పలుకుతారు. తాజ్‌ మహల్‌ సందర్శన ముగిసిన తర్వాత ట్రంప్‌ ఢిల్లీకి వెళ్తారు. ఈ నెల 25న ట్రంప్‌కు రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయబద్దంగా స్వాగతం లభిస్తుంది. రాజ్‌ఘాట్‌ వద్దకు వెళ్లి మహాత్మా గాంధీకి ట్రంప్‌ నివాళులు అర్పిస్తారు. తదనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి ట్రంప్‌ భేటీ అవుతారు.

ఉభయ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు వీరి పర్యటన దోహదపడుతుందని ఇదివరకే వైట్ హౌస్ ప్రకటించింది. భారత్‌కు సుమారు రూ.13,543 కోట్ల ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టంను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా హోంశాఖ అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్‌ పర్యటన ఖరారు కావడం విశేషం.

Next Story