రాజీవ్‌గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

By సుభాష్  Published on  21 July 2020 11:09 AM IST
రాజీవ్‌గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరు జైలులో మంగళవారం ఉదయం ఈ ఆత్మహత్యయత్నం చేశారు. విషయాన్ని గమనించిన జైలు సిబ్బంది ఆమెకు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారో తెలియరాలేదు.

కాగా, రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్‌ కోసం గత కొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలల పాటు పెరోల్‌పై విడుదలై తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్‌ హత్య కేసులో నళినితోపాటు ఆమె భర్త మురుగన్‌ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

గత 29 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘంగా జైలు జీవితం గడిపిన మహిళగా గుర్తింపు పొందారు. 1991, మే 21న ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ నుంచి తమిళనాడులోని శ్రీపెరుంబదూర్‌కు వెళ్లిన రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. అప్పట్లో ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని కూడా ఒకరు. అయితే గతంలోనూ కోర్టు ఆమెకు ఒక రోజు పెరోల్‌ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్‌ నారాయణ్ అంత్యక్రియలకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. 29 ఏళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని ఇప్పుడు ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారోనని జైలు అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story