రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Oct 2020 2:20 PM ISTఆఫ్గాన్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించిన అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి ఘటన మరువకముందే.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నజీబ్ తరకాయ్(29) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. వారం రోజుల కిందట తూర్పు నంగన్‌హర్‌లో రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ కారు నజీబ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కాగా నజీబ్ మరణవార్తను అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ధ్రువీకరించింది. నజీబ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దేశమంతా విషాదంలో మునిగిపోయిందని బోర్డు ట్వీట్ చేసింది. ఇదిలావుంటే.. ఆఫ్గాన్ తరఫున నజీబ్ 12 వన్డేలు ఆడాడు. కెరీర్ మొత్తంలో ఆరు సెంచరీలు చేశాడు.