మహారాష్ట్రలో 39 మందికి కరోనా పాజిటివ్‌..

By అంజి  Published on  17 March 2020 2:56 AM GMT
మహారాష్ట్రలో 39 మందికి కరోనా పాజిటివ్‌..

భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 116కు పెరిగింది. ఇక మహారాష్ట్రలో ఆందోళన కలిగించే స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో 39 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లుగా అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. ఒక్క ముంబైలోనే 14 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ విధించారు. నగరంలో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, సభలు పెట్టరాదని పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర కందం ప్రజలను, నాయకులను కోరారు.

అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని, నగరాన్ని నిర్బంధంలో ఉంచాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే ప్రజలు కోరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలకు గుంపులుగా వెళ్లకూడదని చెప్పారు.

వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వంతో కలిసి ప్రజలు పని చేయాలన్నారు. రానున్న 15 నుంచి 20 రోజులు చాలా కీలమైనవని అన్నారు. ఇప్పటి వరకు ప్రజారవాణా ఆంక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఆందోళనకర పరిస్థితి తలెత్తినప్పుడు ఆంక్షలపై సమీక్షిస్తామని తెలిపారు.

కరోనా పై ఎవరూ ఆందోళన చెందవద్దని..మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే వైరస్ ను అరికట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్ స్టా ద్వారా ప్రజలకు తెలియచేశారు. అలాగే కరోనా పై వస్తున్న వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఆంక్షలు విధించారు. నెలాఖరులోపు 50 మందికన్నా ఎక్కువగా హాజరయ్యే అవకాశమున్న ఎలాంటి సమావేశాలు కానీ, ఫంక్షన్లు కానీ ఎక్కడా నిర్వహించరాదని ఆదేశించారు. నెలాఖరు వరకూ జిమ్ లు, నైట్ క్లబ్ లు, స్పా లను కూడా మూసివేయాలని కోరారు.

Next Story