బాలకృష్ణ బూతు మాట కూడా మాట్లాడారు.. క్షమాపణలు చెప్పాలి: నాగబాబు

By సుభాష్  Published on  28 May 2020 8:26 PM IST
బాలకృష్ణ బూతు మాట కూడా మాట్లాడారు.. క్షమాపణలు చెప్పాలి: నాగబాబు

టాలీవుడ్ అగ్ర‌హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, పేప‌ర్ల‌తో చూసి మాత్ర‌మే తెలుసుకున్నాన‌ని అన్నారు. వారందరూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి భూములు పంచుకుంటున్నారా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. మా అధ్య‌క్షుడు న‌రేష్ కూడా త‌న‌ను పిల‌వడం లేద‌నే అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. తనను ఒక్కరు కూడా పిలవలేదని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మీటింగ్ కు కూడా పిలవలేదని పక్కనే ఉన్న వాళ్ళతో కూడా బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న రోజుకూలీలను ఆడుకోవాలని, చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని మెగా స్టార్ చిరంజీవితో కూడిన బృందం ఇటీవల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ భేటీలకు నందమూరి బాలకృష్ణ హాజరు కాలేదు. తనను ఒక్కరు కూడా పిలవలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా బాలకృష్ణ అంటే కమెడియన్ అంటూ వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. ఈసారి నందమూరి బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. తన యూట్యూబ్ అకౌంట్ లో వీడియోను అప్లోడ్ చేశారు నాగబాబు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బాలకృష్ణను మీటింగ్ కు పిలిచి ఉండకపోవచ్చని అయితే, భూములను పంచుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఒక నిర్మాతగా, నటుడిగా తనకు బాధను కలిగించాయని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి వచ్చినంత మాట్లాడటం సరికాదని, ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇండస్ట్రీకి మీరేం కింగ్ కాదు మీరు కూడా ఒక హీరో మాత్రమే అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి , తెలుగు చిత్ర పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఇలాగే మాట్లాడతానని అంటే... అంతకు పది రెట్లు మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఇండస్ట్రీ బాగు కోసమే వెళ్లారు కానీ, భూములు పంచుకోవడానికి కాదు బాలకృష్ణగారూ అని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో, తెలుగుదేశం పార్టీని నమ్మితే సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో.. ఒకసారి ఏపీకి వెళ్తే తెలుస్తుందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని, బాలయ్య మాట్లాడింది చాలా తప్పని నాగబాబు ఖండించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు పరిశ్రమనే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్నాయని నాగబాబు అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారినే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు భేటీ అయ్యారని.. షూటింగ్ లను ఎలా ప్రారంభించాలనే దానిపై చర్చించారని తెలిపారు. మీటింగ్ కు తనను పిలవలేదని బాలకృష్ణ చెప్పడంలో తప్పులేదని.. భూములు పంచుకుంటున్నారని ఆరోపించడం దారుణమని చెప్పారు. ఏదో బూతు మాట కూడా మాట్లాడారని... మీడియాలో దాన్ని బీప్ చేశారని అన్నారు.

Next Story