నట సార్వభౌముడికి ప్రముఖుల ఘన నివాళి

By సుభాష్  Published on  28 May 2020 7:56 AM GMT
నట సార్వభౌముడికి ప్రముఖుల ఘన నివాళి

నంద‌మూరి తార‌క‌రామారావు 97వ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు ఆయ‌నకి ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు. బాల‌కృష్ణ‌తో పాటు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఇంటి వ‌ద్ద ఉండే త‌మ తాత‌కి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ‘మీరు లేని లోటు తీరనది’ అంటూ పేర్కొన్నారు. ‘ మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్. క‌ళ్యాణ్ రామ్ త‌న ట్విట్ట‌ర్‌లో 'మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత' అంటూ శ్రద్ధాంజ‌లి ఘ‌టించారు

ప్రతి ఏడాది హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పిస్తూ వస్తుంటారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. కానీ ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు వెళ్ళలేదు. ఈ ఏడాది ఉన్న పరిస్థితులను చూసి దీనిని ర‌ద్దు చేసుకున్నారు. నందమూరి కుటుంబం వస్తోందంటే ఆ ప్రాంతంలో మీడియా, అభిమానుల సందడి ఉంటుంది. ఎవరంటే వాళ్ళు వచ్చి మీద పడే అవకాశం ఉండడంతో ఈసారి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.

మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న సోషల్ మీడియా అకౌంట్ లో ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ఒక‌రికొక‌రు స్వీట్ తినిపించుకుంటున్న ఫోటోని షేర్ చేస్తూ శ్ర‌ద్ధాంజ‌లి ఘటించారు. తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం .. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం .. నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం.. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ... అని పోస్ట్ చేశారు చిరంజీవి.

Next Story