రఫెల్‌ @ 20

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2020 7:19 AM GMT
రఫెల్‌ @ 20

ఎర్రమట్టి కోర్టులపై మకుటం లేని మహరాజు తానేనని మరోమారు నిరూపించాడు స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌. 13వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్‌ సీడ్, నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను ఓడించిన నాదల్‌ కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెదరర్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ సమం చేశాడు. సాధారణంగా ప్రతి యేటా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మే-జూన్‌ నెల్లలో జరుగుతుంది.

కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో నిర్వహించారు. తేదీలు మారీనా విజేత మారలేదు. ఆదివారం ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 2 గంటల 41 నిమిషాల్లో 6–0, 6–2, 7–5తో జొకోవిచ్‌ను ఓడించాడు. టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా నాదల్‌ టైటిల్‌ నెగ్గడం ఇది నాలుగోసారి. నాదల్‌కు 16 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌ జొకోవిచ్‌కు 8,50,500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఈ ఏడాది చాలా కఠినంగా ఉంది. 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఫెడరర్‌ రికార్డును సమం చేసినా.. అది ఒక అంకె మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నాకెప్పటికీ ప్రత్యేకమే. నా కెరీర్‌లో గొప్ప క్షణాలన్నీ ఇక్కడే వచ్చాయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌తో, పారిస్‌ నగరంతో నా ప్రేమానుబంధం చిరస్మరణీయమైనది - నాదల్‌

'ఒక వ్యక్తిగా, ఛాంపియన్‌గా నా మిత్రుడు రఫెల్‌ ఎల్లప్పుడూ నిండు హృదయంతో గౌరవించాను. ఏళ్లుగా నా ప్రధాన ప్రత్యర్థి అయినందున, మరింత అత్యుత్తమ ఆటగాళ్లుగా రాటుదేలేందుకే ఒకరిని ఒకరం ఓడించుకుంటూ వచ్చామని భావిస్తున్నా. ఈ క్రమంలోనే కెరీర్‌లో 20 గ్రాండ్‌ స్లామ్‌ సాధించిన సందర్భంగా రఫెల్‌కు అభినందనలు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం రికార్డు స్థాయిలో అతడు 13వ సారి ఈ టైటిల్‌ను సాధించాడు.

ఇది క్రీడల్లోనే అరుదైన ఘనత. ఈ సందర్భంగా నాదల్‌ బృందాన్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఇంత గొప్ప విజయం సాధించడమంటే ఏ ఒక్కరితోనే కుదరదు. మా ఇద్దరి ప్రయాణంలో 20 అనేది ఒక మైలురాయి మాత్రమేనని అనుకుంటున్నా. ఇక ఈ మ్యాచ్‌లో రఫా చాలా బాగా ఆడావు. ఈ విజయానికి నువ్వు అర్హుడివి' అని భావోద్వేగపూరితంగా ట్వీట్‌ చేశాడు - రోజర్‌ ఫెదరర్‌

Next Story