కీలక తీర్పు: భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

By సుభాష్  Published on  26 Oct 2020 1:00 PM GMT
కీలక తీర్పు: భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

యూపీలోని ముజఫర్‌నగర్‌ కతౌలి తెహ్సిల్‌ జిల్లా ఫ్యామిలి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్తకు నెలవారీ భరణం ఇవ్వాల్సిందిగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..కిషోరీలాల్‌ సోహుంకర్‌, మున్నాదేవీలకు 30 సంవత్సరాల కిందట వివాహం అయింది. కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి బేధాలు తలెత్తాయి. రానురాను విబేధాలు మరింత తీవ్రం కావడంతో పది సంవత్సరాల కిందట వీరు విడిపోయారు. మున్నాదేవి కాన్పూర్‌లోని ఇండియన్‌ ఆర్మీలో ఫోర్త్‌ గ్రేడ్‌ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. ఆమెకు ప్రస్తుతం నెలకు 12వేల రూపాయల పెన్షన్‌ వస్తోంది. అయితే కిషోరీలాల్‌ కతౌలీలో ఓ టీషాపు నడుపుకొంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణఃగా తన భార్యకు వచ్చే పెన్షన్‌లో కొంత ఇవ్వాలని 9 సంవత్సరాల కిందట ముజఫర్‌నగర్‌లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

అయితే కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్‌ అడ్వకేట్‌ బలేష్‌ కుమార్‌ తయాల్‌ కోర్టుకు వివరించారు. ఇద్దరు కలిసి ఉండాలని కోర్టు గతంలో ఆదేశించినా.. మున్నీదేవి అందుకు నిరాకరించిందని తెలిపారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని వెల్లడించారు. కాగా, కోర్టు తీర్పుతో తృప్తి కలగలేదని కిషోరీలాల్‌ అన్నారు. 20 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోందని, ప్రస్తుతం తన భార్య పింఛన్‌ను రూ.12వేల కన్నా ఎక్కువే వస్తోందని అన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ విచారణలో.. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. నెలకు వెయ్యి రూపాయల చొప్పున భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story