నాడు గాజులు అమ్మాడు..నేడు ఐఎఎస్ అయ్యాడు..!
Ramesh Gholap's Journey From A Bangle Seller To Becoming An IAS.జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ గాజులు అమ్మి ఉన్నత చదువులు చదువుకున్నాడు. నేడు ఒక జిల్లా అధికారి IASగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
By తోట వంశీ కుమార్ Published on 17 Jan 2021 2:00 PM GMTసాధారణంగా కొందరు జీవితాలు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటాయి. ఎంతో ధైర్యంతో ఆ కష్టాల సుడిగుండంలో ఈదుకుంటూ జీవితంలో ముందుకు సాగుతుంటారు. మరికొందరు ఆ కష్టాలని ఎదిరించలేక జీవితాన్ని అంతటితో ముగిస్తుంటారు. ఆ విధంగా ఈ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ గాజులు అమ్మి ఉన్నత చదువులు చదువుకున్నాడు. నేడు ఒక జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అతని పేరు రమేష్ గోలప్. తన జీవితంలో వచ్చిన కష్టాలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని నేడు ఉన్నత స్థానంలో నిలిచిన రమేష్ కథ ఇది..
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వార్సీకి చెందిన రమేష్ గోలప్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇతనికి చిన్న తనంలోనే ఎడమ కాలికి పోలియో సోకిన జీవితంలో ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా ముందుకు సాగాడు. తన తండ్రి ఒక సైకిల్ షాపు నిర్వహిస్తూ ఉండేవాడు తనకొచ్చిన ఆదాయంతోనే కుటుంబ పోషణ ఎంతో భారమైంది. అంతే కాకుండా తన తండ్రి తాగుడుకు బానిసై ఉన్న డబ్బులు మొత్తం తాగుడుకే ఖర్చు చేసేవాడు. దీంతో కుటుంబ పోషణ భారమై రమేష్ తన తల్లి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి గాజులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు.
ఒకవైపు గాజులు అమ్ముకుంటూ మరోవైపు చదువులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తన చదువును ముందుకు సాగిస్తూ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించే వాడు. అదే సమయంలో రమేష్ తండ్రి మరణించడంతో తనకు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.ఎన్ని కష్టాలు ఎదురైనా తన చదువును మాత్రం ఆపకుండా తన తల్లి విమల ఎంతో కష్టపడి తనని చదివించింది.పెద్ద చదువులు చదవాలంటే ఆర్థిక స్తోమత సరిపోక తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డీఎడ్ కోర్సు పూర్తిచేసి టీచర్ గా ఉద్యోగం నిర్వహించాడు.ఆ ఉద్యోగం అతనికి సంతృప్తినివ్వలేదు ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించాలనే సివిల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు.
2009లో తన తల్లి స్వయం సహాయక బృందం నుంచి డబ్బులు తీసుకొని UPSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాడు. ఆ విధంగా మొదటి సారి పరీక్షలను వ్రాసినప్పుడు ఉత్తీర్ణత సాధించలేదు. అయినా పట్టు వదలకుండా రెండవ సారి పరీక్షల కోసం రాత్రి,పగలు కష్టపడి చదివి 2012 యూపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో 287వ ర్యాంకు సాధించి IAS అయ్యాడు.అలా 2012 మే 4న IAS అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టినప్పుడు అతని ఆనందం అంతా ఇంతా కాదు.అలా గాజులమ్మే రమేష్ జార్ఖండ్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. డ్యూటీలో ఏమాత్రం రాజీ పడని రమేష్ అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు.